Amaravati Iconic Bridge | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతిని విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారితో అనుసంధానించేందుకు కృష్ణా నదిపై ఓ ఐకానిక్ కేబుల్ వంతెన (Iconic Cable Bridge) నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు అమరావతికి ప్రత్యేక గుర్తింపు కలిగించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటికే నాలుగు ప్రత్యేక డిజైన్లు ఎంపిక చేసి, వాటిలో ఒకదానిని ఎంపిక చేసేందుకు ప్రజల ఓటింగ్‌కు అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ కేబుల్ బ్రిడ్జి డిజైన్లు ఆధునిక ఇంజినీరింగ్ శైలితో పాటు కూచిపూడి కళను మిళితం చేసింది. ఎంపిక చేసిన నాలుగు నమూనాల్లో 3 కూచిపూడి నృత్య శైలిని ప్రతిబింబిస్తే, ఒక డిజైన్ అమరావతిని సూచించేలా ఆంగ్ల అక్షరం ‘A’ ఆకారంలో ఉంది. ఇవన్నీ అమరావతికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావడానికే రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి డిజైన్‌ను డిసైడ్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం ఏపీ ప్రజలకే కల్పించింది.
ఐకానిక్ కేబుల్ వంతెన డిజైన్‌పై ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలంటే, CRDA వెబ్‌సైట్‌కి వెళ్లాలి. వెబ్‌సైట్ హోంపేజీలో Vote for Amaravati Iconic Bridge Design అని స్క్రోల్ అవుతుంటుంది. దాని మీద క్లిక్ చేస్తే వేరే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు, ఫోన్ నెంబర్ నమోదు చేసి, అందుబాటులో ఉన్న 4 డిజైన్లలో ఒకదాన్ని ఎంచుకోవాలి. అనంతరం క్యాప్చా కోడ్ ఇచ్చి ఓటు నమోదు చేయవచ్చు. ఐకానిక్ బ్రిడ్జి డిజైన్‌కు ఇక్కడ ఓటేయండి https://crda.ap.gov.in/apcrdav2/userInterface/Bridge_poll_Tel.aspx
ఈ ఐకానిక్ వంతెన (Iconic Cable Bridge) రాయపూడి (అమరావతి) నుంచి కృష్ణా నదిని దాటి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు నిర్మించనున్నారు. వంతెన పొడవు సుమారు 5 కిలోమీటర్లుగా ఉండబోతుంది. ఈ నిర్మాణం పూర్తయితే రాయపూడి నుంచి మూలపాడు వరకు మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి రానుంది.
అమరావతి - హైదరాబాద్ హైవేను కనెక్ట్ చేసే ఐకానిక్ బ్రిడ్జ్