Guntur Latest News: తురకపాలెం: గుంటూరు రూరల్ లో తురకపాలెంలో వరస మరణాలు ప్రభుత్వాన్ని ఆందోళన గురిచేస్తున్నాయి. గడిచిన మూడు నెలల్లో ఇరవై ముగ్గురు మృతి చెందారు. ఒక చిన్న ఊరిలో ఏకంగా ఇన్ని మరణాలు జరగడంతో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. గుంటూరు సిటీకి కూత వేటు దూరంలో ఉంటే తురక పాలెంలో ప్రజలు వరుసగా చనిపోతుండడంతో ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపింది ఏపీ ప్రభుత్వం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాలతో డాక్టర్ రఘునందన్ నేతృత్వంలో గ్రామం లో వైద్యుల బృందం పర్యటించింది.
ఊరిలో అందరికీ వైద్య పరీక్షలుగుంటూరు జిల్లా తురకపాలెంలో గ్రామంలో గడచిన 5 నెలల్లో 30 మంది ప్రాణాలు విడిచారు.. ముఖ్యంగా జులై, ఆగస్టు నెలల్లో 20 మరణాలు సంభవించాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 3 మరణాలు సంభవించగా, ఒకటి రోడ్డు ప్రమాదం కారణంగా జరిగింది. అయితే ఈ మరణాలు మెలైడియోసిస్ అనే వ్యాధి కారణంగా జరిగాయా లేదా అన్న విషయం శనివారంలోగా అందే రక్త నమూనాల పరీక్షల నివేదిక ఫలితాల ద్వారా తెలుస్తుందని ఉన్నత వైద్యుల బృందానికి నేతృత్వం వహించిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ రఘునందన్ వెల్లడించారు. ప్రస్తుతం గుంటూరు జిజిహెచ్ లో ఇద్దరు ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
ఇప్పటి వరకు జ్వరంతో ఉన్న 29 మంది నుంచి సేకరించిన రక్తనమూనాలను గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని మైక్రోబయోలజీ ల్యాబ్‌లో పరీక్షిస్తున్నారని చెప్పారు. బ్యాక్టీరియా కారణంగా వచ్చే మెలైడియోసిస్ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఐవి యాంటీబయోటిక్ చికిత్స ద్వారా రోగులు కోలుకుంటారని డాక్టర్ లు చెప్పారు. డాక్టర్లు చెప్పినదాన్ని బట్టి ఈ ఏడాది జనవరి నుంచి మార్చ్ మధ్య ఐదుగురు మరణించారు. ఏప్రిల్‌లో 2, మేలో 3, జూన్‌లో 2, జులైలో 10, ఆగస్టులో 10 చొప్పున మరణాలు నమోదయ్యాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 3 మరణాలు జరిగినట్లు నమోదయ్యాయి. వీరిలో ఏడుగురు వేర్వేరు సమయాల్లో గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
బీపీ, షుగర్, కిడ్నీల పనితీరు మందగించడం వంటి ఇతర వ్యాధులు కలిగిన మరణించిన వారిలో 80 శాతం మంది పురుషులున్నారు. చనిపోయిన వారి వయసు సగటు 55. ఓ ప్రైవేట్ ఆసుపత్రి వారి రోగుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా ఇద్దరు మెలైడియోసిస్ బారిన పడినట్లు గుర్తించారని వైద్య బృందం దృష్టికొచ్చింది. గత నెలలో వేర్వేరు తేదీల్లో ఈ రెండు కేసులు వచ్చాయి. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ల్యాబ్ లో జరిగే పరీక్షల ఫలితాల కోసం డాక్టర్లు ఎదురుచూస్తున్నారు. తురకపాలెం గ్రామంలో గత నెల 29 నుంచి వైద్య శిబిరం కొనసాగుతోంది. గ్రామ జనాభా 2500 కాగా, వీరిలో ఇప్పటి వరకు 1200 మందికి పరీక్షలు చేశారు. వీరిలో ఎక్కువ మందిలో జ్వర పీడితులున్నారు. వీరు ఇళ్ల వద్దనే చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువ మందికి దగ్గు, కీళ్ల నొప్పులున్నాయి.
స్థానికుల్లో 30 ఏళ్లు దాటిన వారిలో బీపీతో 30 శాతం, షుగర్ తో 10 శాతం మంది బాధపడుతున్నారు. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ లో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు డీఎంఈ డాక్టర్ రఘునందన్ వెల్లడించారు. అలాగే తురకపాలెం గ్రామంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొందని డీఎంఈ రఘునందన్ అన్నారు. స్థానికులు పరిసర ప్రాంతాల్ని శుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరారు.
గ్రామస్తులందరికీ పరీక్షలు చేయాలిః మంత్రి సత్యకుమార్ ఆదేశాలు
తురకపాలెంలోని అందరికీ కిడ్నీ పరీక్షలు, షుగర్ తో పాటు అవసరమైన ఇతర పరీక్షలు చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. వైద్య శిబిరాల్ని కొనసాగించాలని, వ్యక్తిగత శుభ్రతపై స్థానికులకు అవగాహన కల్పించాలని సూచించారు. మరోవైపు తురకపాలెం గ్రామంలో ఉన్నప్పుడే డీఎంఈ డాక్టర్ రఘునందన్ కు ఫోన్ చేసి క్షేత్రస్థాయి సమాచారాన్ని తెలుసుకున్నారు. తాజాగా అ బృందం తో మంత్రి సమీక్ష జరిపారు. తురకపాలెం లో పరిస్థితి ప్రస్తుతానికి అదుపులో ఉన్నట్టు కనిపిస్తుందనీ అయినప్పటికీ అప్రమత్తతో ఉండాలని అధికారులకు హెల్త్ మినిష్టర్ సూచించారు.