హనీతో పాటు డాన్స్ చేయాల్సిన టీచర్ సుశీల కనిపించడం లేదని తులసి వచ్చి సామ్రాట్ కి చెప్తుంది. దీంతో ఇద్దరు కలిసి టీచర్ కోసం వెతుకుతారు. ఎంత వెతికినా కనిపించకపోయేసరికి ఇద్దరూ కంగారూ పడతారు. హనీ ముఖంలో నిరాశ, కన్నీళ్ళు కనిపించకూడదు, ఏం చేసి అయిన, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ఇంకో టీచర్ ని ఏర్పాటు చెయ్యమని సామ్రాట్ తన బాబాయ్ కి చెప్తాడు. డబ్బుతో ఏర్పాటు చేయలేరు ఇప్పటికిప్పుడు ప్రాక్టీస్ లేకుండా ఎవరు చేయలేరని తులసి అంటుంది. ఎలాగైనా టీచర్ ని వెతికి తీసుకొస్తానని సామ్రాట్ వెళ్ళిపోతాడు. హనీ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చూసి తులసి బాధపడుతుంది. టీచర్ కంగారుగా ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్లిపోయిందని అక్కడి వాచ్ మెన్ సామ్రాట్ కి చెప్తాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని సామ్రాట్ అరుస్తాడు. ఇప్పుడు హనికి ఏమని చెప్పాలి, తనకి ఏం చెప్పి కన్వీన్స్ చెయ్యాలి అని సామ్రాట్ బాధపడతాడు. ప్రదర్శన ఇవ్వాల్సిందిగా హనీ పేరుని పిలుస్తారు. ఆంటీ కాంపిటీషన్ వాళ్ళు నా పేరు పిలుస్తున్నారు టీచర్ ఎక్కడా అని హనీ తులసిని అడుగుతుంది. ఇక తులసి అక్కడి ఉన్న జడ్జిలకి పరిస్థితి చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. అది చూసి మనం చేయాల్సిన పని తులసి చేస్తుందని సామ్రాట్ అంటాడు. ఇక హనీ కంగారుగా ఏమైందని తులసిని హనీ అడుగుతుంది. నువ్వు వెళ్ళి స్టేజ్ మీద డాన్స్ చెయ్యి మీ టీచర్ ని వెనకాలే నేను పంపిస్తాను అని చెప్తుంది.
హనీ స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే అప్పుడే తులసి ఎంట్రీ ఇస్తుంది. హనీతో కలిసి తులసి డాన్స్ చేస్తుంది. అది చూసి నందు, లాస్య షాక్ అవుతారు. సామ్రాట్ షాక్ అయినా తేరుకుని సంతోషంగా చూస్తూ ఉంటాడు. హనీ, తులసి కలిసి స్టేజ్ మీద డాన్స్ ఇరగదీస్తారు. మేమిద్దరం కలిసి స్టేజ్ మీద డాన్స్ వేస్తుంటే ఎంత బాగుందో నేను ఈ కాంపిటీషన్ లో నేను గెలవకపోయిన పర్వాలేదు ఇది చాలు అని హనీ అంటుంది. ఇక ఈ పోటీలు చాలా టఫ్ గా జరిగిందని యాంకర్ చెప్తుంది. ఇద్దరు పేర్లని పిలుస్తారు వారిద్దరిలో ఎవరు విన్నరో జడ్జి లు ప్రకటిస్తారు అని చెప్తారు. ఇక లక్కీ, హనీని స్టేజ్ మీదకి పిలుస్తారు. ఇక ఎవరు గెలుస్తారా అని అందరూ టెన్షన్ పడుతుంటే ఇద్దరూ విన్నర్స్ అని యాంకర్ ప్రకటిస్తుంది. అది చూసి తులసితో సహా అందరూ సంతోషిస్తారు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఇది స్టూడెంట్ టీచర్ కాంపిటీషన్ కదా హనీతో కలిసి తులసి ఎలా డాన్స్ చేస్తుంది అని అడుగుతాడు. అలా విన్నర్ గా ఎలా డిక్లేర్ చేస్తారని నిలదీస్తాడు. అది పెద్ద విషయం కాదు తులసి గారు హనికి సంగీతం నేర్పించే టీచర్, ఈ డాన్స్ కూడా ఆమె నేర్పించారు. తనతో డాన్స్ చేసే టీచర్ చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడంతో తులసి గారు హనీతో డాన్స్ చేసేందుకు పర్మిషన్ అడిగారు. టీచర్ చేసిన తప్పు వల్ల స్టూడెంట్ కి అన్యాయం జరగకూడదు. అందుకే తులసి గారు అడిగింది న్యాయం అనిపించి ఒప్పుకున్నామని జడ్జి చెప్తాడు. అది విని అందరూ చప్పట్లతో తులసిని అభినందిస్తారు.
Also Read: జైలు నుంచి బయటికి వచ్చేందుకు ఖైలాష్ ప్లాన్, కాంచనకి వేద క్షమాపణలు- ఖైలాష్ ని విడిపించమన్న మాలిని
హనీ, లక్కీకి అవార్డ్ ప్రజంటేషన్ జరుగుతుంది. ఇక పిల్లల తల్లిదండ్రులు కూడా స్టేజ్ మీదకి రావాలని పిలుస్తారు. ఈరోజు నా గెలుపుకి కారణం తులసి ఆంటీ.. ప్రైజ్ తీసుకునేటప్పుడు నా పక్కన తులసి ఆంటీ ఉండాలని కోరుకుంటున్నా అని హనీ అంటుంది. సామ్రాట్ వచ్చి మా మనసులో మాట హనీ నోటి నుంచి వచ్చింది వెళ్ళండి తులసి గారు అని సామ్రాట్ అడుగుతాడు. కానీ తులసి మాత్రం పిల్లల పక్కన పేరెంట్స్ ఉండాల్సిన సమయం నేను కాదు అని అంటుంది. అమ్మ కంటే ఎక్కువ చేశావ్ ధైర్యం చెప్పావ్ హనీ పక్కన నిలబడే అర్హత నీదేనమ్మా అని సామ్రాట్ బాబాయ్ సర్ది చెప్పడంతో తులసి స్టేజ్ మీదకి సామ్రాట్ తో కలిసి వెళ్తుంది. అది చూసి లాస్య నందుతో పేరెంట్స్ ఉండాల్సిన ప్లేస్ లో తులసి ఉంది చూడు అని నూరిపోస్తుంది. ఇక జడ్జిలు లక్కీ, హనికి బహుమతులు ఇస్తారు.
తరువాయి భాగంలో..
నందు, లాస్య తులసి ఇంటికి వస్తారు. మ్యూజిక్ స్కూల్ ప్లాన్ గురించి మాట్లాడటానికి వచ్చామని నందు చెప్తాడు. మ్యూజిక్ స్కూల్ కి ఇన్వెస్ట్మెంట్ చేసేది సామ్రాట్ గారు కదా అని అంకిత అంటుంది. మేము సామ్రాట్ గారి కంపెనీలో హోదాలో ఉన్న ఆఫీసర్లమని నందు అంటే.. పనోళ్లా అని అనసూయ హేళనగా అంటుంది.