Robinhood Release Update : ప్రస్తుతం ఎక్కడ చూసినా 'పుష్ప 2' మానియా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఎఫెక్ట్ డిసెంబర్లో రిలీజ్ అయ్యే అన్ని సినిమాలపై పడింది.అందుకే డిసెంబర్లో రిలీజ్ కావాల్సిన కొన్ని సినిమాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. కానీ నితిన్ హీరోగా నటించిన 'రాబిన్ హుడ్' మూవీ రిలీజ్ విషయంలో మాత్రం చిత్రబృందం డైలమాలో ఉంది అంటూ గత రెండు రోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా 'రాబిన్ హుడ్' సంక్రాంతికి వచ్చేయబోతున్నాడు అని టాక్ నడుస్తోంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. కానీ అదే నిజమైతే ఈ మూవీని రిలీజ్ చేయబోతున్న మైత్రి మూవీ మేకర్స్ డేరింగ్ నిర్ణయం తీసుకున్నట్టే. కానీ ఈ సాహసం అసలు వర్కౌట్ అవుతుందా ? అనేది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. 


సంక్రాంతి బరిలోకి 'రాబిన్ హుడ్'... 


యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్నాడు. 2020లో వచ్చిన 'భీష్మ' తర్వాత ఒక్క హిట్ కూడా లేదు. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, మాచర్ల నియోజకవర్గం, మాస్ట్రో సినిమాలతో హ్యాట్రిక్ డిజాస్టర్ లను అందుకున్నాడు నితిన్. దీంతో మిగతా హీరోలతో పోలిస్తే నితిన్ వెనకబడ్డాడు అని చెప్పాలి. అందుకే ఆయన 'రాబిన్ హుడ్' సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు. తనకు 'భీష్మ' మూవీతో హిట్ ఇచ్చిన డైరెక్టర్ వెంకీ కుడుములతో ఈ సినిమాకు శ్రీకారం చుట్టాడు. నిజానికి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అనౌన్స్ చేశారు. కానీ ప్రస్తుతం 'పుష్ప 2' ఫీవర్ నడుస్తుండడంతో ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. ఇక తాజాగా సంక్రాంతి బరిలోకి దిగబోతుందంటూ ప్రచారం జరుగుతుంది. 


ఈ సాహసం వర్కౌట్ అవుతుందా? 


కానీ మైత్రి మూవీ మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే సంక్రాంతిపై వెంకటేష్, బాలయ్య, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు కర్చీఫ్ వేసి కూర్చున్నారు. జనవరి 10న రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్' రిలీజ్ కాబోతోంది. అలాగే బాలయ్య నటిస్తున్న 'డాకు మహారాజ్' జనవరి 12న, వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' జనవరి 14న రిలీజ్ కాబోతున్నాయి. ఈ మూడు సినిమాలను కూడా దిల్ రాజు రిలీజ్ చేస్తుండడం గమనార్హం. ఇక మరోవైపు అజిత్ హీరోగా నటించిన డబ్బింగ్ మూవీ 'విడామయూర్చి' కూడా పొంగల్ రేసులో మేమున్నాము అంటూ రీసెంట్ గా టీజర్ ద్వారా వెల్లడించారు. 


నిజానికి అజిత్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'గుడ్ బాడ్ అగ్లీ' మూవీని సంక్రాంతి రేస్ లో నిలబెట్టాలి అనుకున్నారు. కానీ అది వర్కౌట్ కాలేదు. దాని బదులు అజిత్ హీరోగా నటించిన మరో మూవీ 'విడామయూర్చి' మూవీ ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతోంది. అయితే 'గుడ్ బాడ్ అగ్లీ' వర్కౌట్ కాకపోవడంతో మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు 'రాబిన్ హుడ్' సినిమాను సంక్రాంతికి తీసుకువస్తుంది. మరి ప్రస్తుతం హిట్ కోసం ఆకలి మీద ఉన్న నితిన్ సోలోగా వస్తే వర్కౌట్ అవుతుంది కానీ, ఇలా గుంపులో గోవిందా అని వస్తే ఎంతవరకు కలిసి వస్తుంది అనేది ఆయన అభిమానులను టెన్షన్ పడుతున్న విషయం.



Also Readఇయర్ ఎండ్ రివ్యూ 2024: బాలీవుడ్‌లో ఈ ఐదుగురు హీరోలు డిజప్పాయింట్ చేశారబ్బా... ఒక్కటంటే ఒక్కటి కూడా రాలే