Nani - Rana: ఈరోజుల్లో చాలావరకు యంగ్ హీరోలు మల్టీ స్టారర్ చేయడానికి, ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్స్‌లో కనిపించడానికి, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం వెనకాడడం లేదు. కంటెంట్ ఉన్న సినిమాల్లో నటిస్తే ఆడియన్స్ ఎలాగైనా యాక్సెప్ట్ చేస్తారని వారు నమ్ముతున్నారు. అందుకే తెలుగులో హీరోల ప్రిఫరెన్స్ చాలా మారిపోయింది. తాజాగా నాని, రానా కూడా తాము ముందెన్నడూ కనిపించని పాత్రల్లో కనిపించనున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరితో కలిసి సినిమా చేయడం కోసం ఒక సైకో కిల్లర్ కథను సిద్ధం చేస్తున్నాడట టాలీవుడ్ యంగ్ డైరెక్టర్.
HIT ఫ్రాంచైజ్..
నేచురల్ స్టార్ నాని.. ఇప్పటికే టాలీవుడ్‌కు ఎంతోమంది యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకులను పరిచయం చేశాడు. అందులో శైలేష్ కొలను కూడా ఒకటి. ఇప్పటికే బాలీవుడ్‌లో మల్టీవర్స్ కాన్సెప్ట్ బాగా ట్రెండ్ అవుతోంది. కోలీవుడ్ కూడా ఆ ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. అలాంటి ట్రెండ్‌ను తెలుగులోకి తీసుకొచ్చాడు శైలేష్ కొలను. తన దగ్గర ఉన్న ‘HIT’ కథలతో HITవర్స్‌ను రెడీ చేశాడు. ఆ చిత్రాలకు నాని నిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ నుంచి రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఆ రెండూ బ్లాక్‌బస్టర్ HITస్‌గా నిలిచాయి. ఇక ఈ ఫ్రాంచైజ్‌లోని మూడో చిత్రంలో నాని హీరోగా నటించనున్నాడు.
దయలేని పోలీస్..
‘HIT’లో విశ్వక్ సేన్, ‘HIT 2’లో అడవి శేష్ హీరోలుగా నటించారు. ఈ రెండు సినిమాల్లో ఒక కష్టమైన కేసును పరీక్షరించే పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో వారు కనిపించారు. ఇక ‘HIT 3’లో విక్రమ్ సర్కార్ అనే పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు నాని. ఈ విషయాన్ని ‘HIT 2’ క్లైమాక్స్‌లోనే రివీల్ చేశాడు దర్శకుడు శైలేష్ కొలను. అయితే విక్రమ్ సర్కార్ పాత్ర.. నాని మొదటి నుంచి చేస్తున్న పాత్రలకంటే చాలా భిన్నం. ప్రతీసారి పక్కింటబ్బాయిగా యూత్‌కు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్లలోనే ఎక్కువగా కనిపించాడు నేచురల్ స్టార్. కానీ మొదటిసారి ఒక దయలేని పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఇక ఈ మూవీలో ప్రేక్షకులను భయపెట్టే విలన్ పాత్రలో రానా కనిపించనున్నట్టు సమాచారం.
విలన్‌గా ఓకే..
నాని, రానా.. ఇద్దరూ మల్టీ స్టారర్లకు ఎప్పుడూ ఓకే చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. పైగా తమ పాత్రల్లో వేరియేషన్స్ చూపించడం వారికి మరింత ఇష్టం. అందుకే ‘HIT 3’లో విలన్‌గా కనిపించడానికి ఓకే చెప్పాడట రానా. ఇప్పటికే శైలేష్ కొలను.. నాని, రానాలకు కథను వినిపించగా.. అది వారిని ఆకట్టుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. కథ బాగుంటే విలన్‌గా నటించడానికి కూడా రానా వెనకాడడు. అలా ‘బాహుబలి’లో భళ్లాలదేవగా ఇప్పటికే ఆడియన్స్‌ను మెప్పించాడు. త్వరలోనే ‘HIT 3’లో నానితో తలపడుతూ కనిపించడానికి సిద్ధమవుతున్నాడని టాక్ వైరల్ అవుతోంది. మొత్తానికి నాని, రానాలను ఒకే స్క్రీన్‌పై చూడాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ‘HIT 3’తో ఆ కోరిక తీరనుందేమో చూడాలి.
Also Read: మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ మూవీ - అంతేకాదు, మరో బిగ్ సర్‌ప్రైజ్ కూడా ఉందట!