మృణాల్ ఠాకూర్.. ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది.. ‘సీతారామం’లో సీతే. ఆ పాత్రలో మరెవ్వరినీ ఊహించుకోలేం అనేంతగా సీత క్యారెక్టర్‌లో పరకాయ ప్రవేశం చేసింది. అంతేకాదు.. ఎంతో సాంప్రదాయకంగా, క్యూట్‌గా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. దీంతో తెలుగులో మంచి ఆఫర్సే వచ్చాయి. అయితే, ఆమె కంగారు పడకుండా ఆచీతూచి మరీ సినిమాలకు సైన్ చేసింది. ఈమె వదిలేసిన కొన్ని తెలుగు సినిమాలను నిర్మాతలు శ్రీలీలతో భర్తీ చేశారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మృణాల్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. నాని మూవీకి అల్రెడీ సైన్ చేసిన ఈ భామ.. తాజాగా విజయ్ దేవరకొండతో సినిమాకు ఒకే చెప్పింది. అయితే, ఈ మూవీకి ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. 


మృణాల్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో కూడా బిజీగా ఉంది. అయితే, ఇప్పటివరకు అక్కడ సరైన సక్సెస్‌ను అందుకోలేకపోయింది. ఇటీవల విడుదలైన ‘లస్ట్ స్టోరీస్-2’లో కూడా మృణాల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆమె నటించిన ఎపిసోడ్ చాలా డల్‌గా ఉండటం, అంతా బామ్మ నీనా గుప్తా చుట్టూనే కథంతా తిరగడంతో మృణాల్ పాత్ర తేలిపోయింది. ప్రస్తుతం మృణాల్ చేతిలో మరో మూడు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. అలాగే తెలుగులో నాని 30వ చిత్రం, విజయ్ దేవరకొండతో మరో సినిమాలో నటిస్తోంది. అలాగే కోలీవుడ్‌లోకి మృణాల్ అడుగుపెడుతోంది. అక్కడ శివకార్తికేయన్‌తో జత కట్టనున్నట్లు సమాచారం. 


3.5 కోట్ల రెమ్యునరేషన్


మృణాల్, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్నసినిమా.. ప్రముఖ నిర్మాత 'దిల్' రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా 'గీత గోవిందం' వంటి సూపర్ హిట్ తీసిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. జులై 12 నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలుకానుంది. అయితే, ఈ మూవీ కోసం మృణాల్ భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా డిమాండ్ చేసినట్లు టాలీవుడ్ సమాచారం. రూ.3.5 కోట్లకు అగ్రీమెంట్ జరిగిన తర్వాతే ఆమె షూటింగ్‌కు రెడీ అయ్యిందట. మృణాల్‌కు ‘సీతారామం’ మినహా చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా.. యూత్‌లో మాత్రం మాంచి బజ్ ఉంది. దాన్ని సొమ్ము చేసుకోవడం కోసమే నిర్మాతలు తెలుగులో అవకాశాలిస్తున్నారు. అలాగే నటనపరంగా కూడా ఆమెకు పేరు పెట్టలేం. అయితే, మృణాల్ నాని మూవీకి రూ.కోటి వరకు తీసుకుంటోందని, విజయ్ దేవరకొండతో మూవీకి అమాంతంగా రేటు పెంచేసిందని అంటున్నారు. మృణాల్ కూడా శ్రీలీలా తరహాలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అనుకుంటుందేమో మరి. 


రామ్ చరణ్‌ మూవీలోనూ  మృణాల్‌?


మృణాల్‌ మెగా హీరో రామ్ చరణ్‌తో నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావొచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత  రామ్ చరణ్ ‘ఉప్పెన’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు సానాతో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమా నవంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో విజయ్ సేతుపతి కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. ఇందులో హీరోయిన్‌గా మృణాల్‌, జాన్వీ కపూర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 


Also Read: మీకు Project K టీ షర్ట్ ఉచితంగా కావాలా? ఇదిగో ఇలా బుక్ చేసుకోండి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial