సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు & గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కలయికలో హ్యాట్రిక్ సినిమా మొదలైంది. కల్ట్ క్లాసిక్ హిట్ 'అతడు', ఇమేజ్ మేకోవర్ ఫిల్మ్ 'ఖలేజా' తర్వాత... ఈ ఇద్దరూ ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ షురూ చేశారు. రిలీజ్ డేట్ కూడా ఎప్పుడో అనౌన్స్ చేశారు. లేటెస్ట్ టాక్ ఏంటంటే... అనౌన్స్ చేసిన రోజున సినిమా రావడం లేదట! వెనక్కి వెళ్ళిందట!


ఆగస్టు 11 టు అక్టోబర్ 18కి?
ఆగస్టు 11న మహేష్ - త్రివిక్రమ్ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కొన్ని రోజుల క్రితం వెల్లడించింది. అయితే, ఇప్పుడు ఆ తేదీకి కాకుండా అక్టోబర్ 18న విడుదల చేయాలని భావిస్తున్నారట!


ఈ ఏడాది అక్టోబర్ 15న నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. 24వ తేదీ వరకు కొనసాగుతాయి. సినిమాను 18న (బుధవారం) విడుదల చేస్తే... 24 వరకు హాలిడేస్ ఉంటాయి. లాంగ్ వీకెండ్ & ఫెస్టివల్ సీజన్ కింద లెక్క. దాన్ని దృష్టిలో పెట్టుకుని విడుదల వాయిదా వేశారని, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా టైమ్ బాగా ఉంటుందని యూనిట్ భావిస్తోందట. సంక్రాంతి తర్వాత సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. త్రివిక్రమ్ శైలి వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ మేళవించి సినిమా రూపొందిస్తున్నారు. 


Also Read : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్ 



శ్రీలీల సెకండ్ లీడ్ కాదు!
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'మహర్షి' తర్వాత మరోసారి మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో శ్రీలీల కూడా నటిస్తున్నారు. అయితే, ఆమె సెకండ్ లీడ్ అంటూ వస్తున్న వార్తలపై నాగవంశీ స్పందించారు. ''సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒకరు పూజా హెగ్డే, మరొకరు శ్రీలీల. ఒకరు ఫస్ట్, మరొకరు సెకండ్ అంటూ మేం డిసైడ్ చేయలేదు. ఎవరికీ నంబర్లు ఇవ్వలేదు'' అని నాగవంశీ తెలిపారు. 


Also Read : ఆ రోజే పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఓపెనింగ్ 


ఐదు భాషల్లో మహేష్, త్రివిక్రమ్ సినిమా!
'అతడు', 'ఖలేజా' విజయాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న చిత్రమిది. సుమారు పన్నెండేళ్ళ విరామం తర్వాత ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. మహేష్ ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ ఈ సినిమా అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. 


మహేష్ బాబు, త్రివిక్రమ్ తాజా సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది. థియేట్రికల్ విడుదల తర్వాత తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను తమ ఓటీటీ వేదికలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. దాంతో ఇది పాన్ ఇండియా సినిమా అనే క్లారిటీ వచ్చింది. భారీ రేటుకు నెట్‌ఫ్లిక్స్‌కు రైట్స్ ఇచ్చినట్లు టాక్.


మహేష్, త్రివిక్రమ్ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఒక సమయంలో ఆయన్ను సినిమా నుంచి తప్పించారని వార్తలు వచ్చాయి. కానీ, వాటిలో నిజం లేదని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఆల్రెడీ రెండు మూడు ట్యూన్లు తమన్ ఫైనలైజ్ చేశారు. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయి. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.