కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటల ఎక్కబోతుందా? ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో ఏడడుగులు నడవనుందా? గత కొద్ది రోజులుగా మీడియాలో ఇవే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కీర్తి సురేష్ తండ్రి, నిర్మాత జి.సురేష్ కుమార్ స్పందించక తప్పలేదు.
దక్షిణాదిలో తన నటనతో మంచి మార్కులు కొట్టేసిన నటి కీర్తి సురేష్. హోమ్లీ పాత్రలు అనగానే దర్శక నిర్మాతలు ఫస్ట్ సంప్రదించేది కీర్తి సురేష్‌నే. ఈ మధ్య కీర్తి.. గ్లామర్ పాత్రలకు కూడా ఒకే చెబుతోంది. వైవిద్యం కోసం డిగ్లామర్ పాత్రలను కూడా పోషిస్తోంది. ‘సర్కారువారి పాట’ సినిమాలో గ్లామర్ ఒలకబోసిన కీర్తి.. ఆ తర్వాత ‘దసరా’ మూవీలో పల్లెటూరు పిల్లగా మాస్ అవతారంలో మెప్పించింది. ఇటీవల ‘భోళా శంకర్’ మూవీలో చిరంజీవికి సోదరిగా నటించింది. ఆ మూవీ ఫ్లాప్ ప్రభావం కీర్తి సురేష్‌పై కూడా పడింది. ప్రస్తుతం కీర్తికి తెలుగులో అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. అయితే, ఆమెకు తమిళ్, మలయాళంలో మాత్రం ఛాన్సులు వస్తూనే ఉన్నాయి.
ఇక అనిరుధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ‘విక్రమ్’ మూవీ తర్వాత అనిరుధ్ పేరు మార్మోగుతోంది. అతడి స్వరాలకు యూత్‌లో క్రేజ్ మామూలుగా లేదు. ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీస్ ‘జవాన్’, ‘జైలర్’ మూవీలకు అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు సినీ ప్రేమికులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అనిరుధ్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం తీరికలేకుండా గడిపేస్తున్నాడు. ఇప్పట్లో పెళ్లి చేసుకొనే అవకాశాలు కూడా కనిపించడం లేదు. అయితే, మీడియా మాత్రం అనిరుధ్, కీర్తిలు పెళ్లి చేసుకొనేందుకు సిద్ధమవుతున్నారంటూ కోడై కూస్తోంది. ఈ వార్తలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు స్వయంగా కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ స్పందించారు. అవన్నీ తప్పుడు వార్తలని, వారు పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టత ఇచ్చారు. ఏమైనా ఉంటే తానే స్వయంగా మీడియాకు చెబుతానని పేర్కొన్నారు.
మత్యకారుల పాత్రల్లో కీర్తి, నాగచైతన్య!
దర్శకుడు చందు మొండేటి, అక్కినేని నాగ నాగచైతన్యతో ఓ సినిమా చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఈ చిత్రంలో నాగ చైతన్య, కీర్తి సురేష్ మత్స్యకారులుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే, ఈ చిత్ర బృందం ఇప్పటికే శ్రీకాకుళం వెళ్లి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. చేపలు పట్టే వారి జీవన శైలి ఎలా ఉంటుంది? వాళ్లు ఎలా జీవిస్తున్నారు? సముద్రంలోకి వెళ్లి ఎలా చేపలు పడుతారు? అనే విషయాలను గమనించారు. కీర్తి సురేష్ కూడా శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారుల జీవన విధానాన్ని పరిశీలించింది. ఆమె వారితో కలిసి వారం రోజుల పాటు గడిపింది. టాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలంటే కీర్తి సురేష్‌కు ఈ మూవీ హిట్ కావడం చాలా అవసరం. అలాగే, నాగ చైతన్యకు కూడా హిట్ కావాలి. మరి చైతూకు కీర్తి కలిసి వస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం కీర్తి సురేష్ తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది 'సైరన్', 'రివాల్వర్ రీటా, 'రఘు తథా', 'కన్నివేడి' చిత్రాల్లో నటిస్తోంది.
Also Read: అందుకే చంద్రబాబును కలవలేకపోయా: రజినీకాంత్ - సూపర్ స్టార్ రాజమండ్రి పర్యటన రద్దు