మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య'(Acharya) సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో నిర్మాతలు బాగా నష్టపోయారు. దీంతో తన తదుపరి సినిమాతో పెద్ద హిట్ అందుకోవాలని చూస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం ఆయన మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్'(God Father) అనే సినిమాలో నటిస్తున్నారు. మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో నయనతార(Nayanthara), సత్యదేవ్(Satyadev) లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ పోషిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ రాబోతుంది. సెప్టెంబర్ 15న సినిమాలో ఓ పాటను రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
'తార్ మార్ తక్కర్ మార్' అంటూ సాగే ఈ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ మాస్ స్టెప్స్ వేస్తూ కనిపించారు. ప్రోమోనే ఇలా ఉందంటే ఇక ఫుల్ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి!
ఈ సినిమాలో సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ యనతార ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. చిత్రంలో నయనతారను ‘సత్యప్రియ జై దేవ్’ గా పరిచయం చేశారు. ఈ సినిమాలో గాడ్ ఫాదర్ పాత్రను అసహ్యించుకొనే క్యారెక్టర్ లో నయనతార కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నయనతార సీరియస్ లుక్ లో ఆకట్టుకునేలా ఉన్నారు.
ఈ సినిమాలో నయన్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశాడట దర్శకుడు. అయితే, ఇక మోహన్‌లాల్ ఒరిజినల్ ‘లూసీఫర్’ సినిమాలో హీరోయిన్ లేదు. మరి తెలుగులో ఉంటుందా? లేదా? అనేది మాత్రం తెలియదు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారట. అటు ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరంజీవి, నయనతార మరోసారి ఈ సినిమాలో నటించబోతున్నారు.
మలయాళంలో సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘లూసిఫర్’ సూపర్ సక్సెస్ సాధించింది. పృథ్వీరాజ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీగా వసూళ్లను సాధించింది. అదే రేంజిలో ఇక్కడ కూడా సినిమా సక్సెస్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. మెగాస్టార్ సతీమణి కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ సినిమాలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వం మరో సినిమా చేస్తున్నారు.
Also Read : గుణశేఖర్ అవుట్ - త్రివిక్రమ్ చేతికొచ్చిన రానా డ్రీమ్ ప్రాజెక్ట్!
Also Read : మహేష్ ఫ్యాన్స్‌కు పూనకాలే - సినిమా జానర్ రివీల్ చేసిన రాజమౌళి