ఘట్టమనేని రమేష్ బాబు... బాల నటుడు, కథానాయకుడు, నిర్మాత. కాలేయ సంబంధిత సమస్యలతో శనివారం తుదిశ్వాస విడిచారు. ఈతరం ప్రేక్షకులకు ఆయన పెద్దగా పరిచయం లేదని చెప్పాలి. ఎందుకంటే... తెరపై రమేష్ బాబు కనిపించి ఇరవై ఏళ్లు. అప్పటికి, ఇప్పటికి ఆయన రూపురేఖలు చాలా మారాయి.
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడిగా రమేష్ బాబు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన పరిచయం అయ్యారు. అయితే... ఎక్కువ సినిమాలు చేయలేదు. బాల నటుడిగా ఓ అరడజను, కథానాయకుడిగా 15 చిత్రాలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన సినిమా 'అల్లూరి సీతారామరాజు'తో రమేష్ బాబు వెండితెరకు బాలనటుడిగా పరిచయం అయ్యారు.
బాలనటుడిగా చేసిన పాత్రలన్నీ...
'అల్లూరి సీతారామరాజు'లో కృష్ణ టైటిల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఆయన చిన్నప్పటి పాత్రలో రమేష్ బాబు కనిపించారు. యంగ్ అల్లూరి ఆయనే. అదొక్కటే కాదు... ఆ తర్వాత బాల నటుడిగా చేసిన మూడు సినిమాల్లోనూ కృష్ణే హీరో. ఆయన చిన్నప్పటి పాత్రల్లో, యంగ్ కృష్ణగా రమేష్ బాబు కనిపించారు. ఆ తర్వాత దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన 'నీడ', 'పాలు నీళ్లు' సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. 'పాలు నీళ్లు' తర్వాత ఆరేళ్లు విరామం తీసుకుని 'సామ్రాట్' సినిమాతో హీరోగా వచ్చారు.
అగ్ర దర్శకులతో పని చేసినా...
కథానాయకుడిగా రమేష్ బాబు సక్సెస్ అయ్యారా? లేదా? అనేది పక్కన పెడితే... హీరోగా ఆయన చేసిన సినిమాల సంఖ్య 15 మాత్రమే. అందులో చివరి సినిమా 'ఎన్‌కౌంటర్'లో మెయిన్ హీరో కృష్ణే. మిగతా సినిమాలు కొన్నిటిలోనూ కృష్ణ హీరోగా నటించారు. కృష్ణ కుమారుడిగా రమేష్ బాబును ప్రేక్షకులు అభిమానించారు. అగ్ర దర్శకులు దాసరి, కోదండరామి రెడ్డి, వి. మధుసూదన్ రావు, జంధ్యాల సినిమాలు చేశారు. రెండు సినిమాలను కృష్ణ డైరెక్ట్ చేశారు. సోలో హీరోగా 'బజార్ రౌడీ' వంటి సక్సెస్ కూడా రమేష్ బాబు ఖాతాలో ఉంది.
అగ్ర దర్శకులతో పని చేసినా... విజయాలు ఉన్నా... రమేష్ బాబు ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి కారణం ఆయనకు ఆసక్తి లేకపోవడమే అని పరిశ్రమ వర్గాల చెబుతుంటాయి. ఇంకొకటి... రమేష్ బాబు కెరీర్‌ను... కృష్ణను విడదీసి చూడటం కష్టం. చేసినవి కూడా తక్కువ సినిమాలు. అందువల్ల, హీరోగా రమేష్ బాబుకు ప్రత్యేక గుర్తింపు రాలేదేమో అన్నది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయంగా తెలుస్తోంది. అన్నట్టు... రమేష్ బాబు ఓ తమిళ సినిమా కూడా చేశారు. అది టి. రాజేందర్ దర్శకత్వం వహించిన 'శాంతి ఎనతు శాంతి'. ఆ సినిమాకు బాలనటుడిగా ఇప్పటి హీరో శింబు స్టేట్ అవార్డు అందుకున్నారు. హీరోగా సినిమాలు చేయడం మానేసిన తర్వాత రమేష్ బాబు లైమ్ లైట్‌కి దూరంగా ఉండేవారు. అప్పుడప్పుడూ ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో మాత్రమే కనిపించేవారు. మహేష్ సినిమా ఫంక్షన్స్‌కు కృష్ణ వచ్చేవారు కానీ రమేష్ కనిపించింది తక్కువే.
అన్నయ్యను మళ్లీ తీసుకొచ్చిన మహేష్...
హీరోగా పరిశ్రమకు దూరమైన రమేష్ బాబును, మళ్లీ మహేష్ బాబు తీసుకొచ్చారు. అన్నయ్యను నిర్మాత చేశారు. మహేష్ హీరోగా నటించిన 'అర్జున్' సినిమాను రమేష్ బాబు నిర్మించారు. ఆ సినిమా కోసం వేసిన మీనాక్షి టెంపుల్ సెట్ అప్పట్లో టాక్ ఆఫ్ ద టౌన్. తర్వాత యూటీవీ మోషన్ పిక్చర్స్ సంస్థతో కలిసి 'అతిథి' నిర్మించారు. 'దూకుడు', 'ఆగడు' సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు.
అ, ఆ... తెలుగు అక్షరమాలలో ఈ రెండు అక్షరాలు పక్క పక్కనే ఉంటాయి. కానీ, రమేష్ బాబు సినిమా కెరీర్‌లో ఒకటి మొదట, మరొకటి ఆఖరున ఉంటాయి. ఆయన తొలి సినిమా 'అల్లూరి సీతారామరాజు'. బాలనటుడిగా చేసిన ఆ సినిమా 'అ'తో మొదలు అయ్యింది. ఆయన ఆఖరి సినిమా 'ఆగడు'. దానికి ఆయన సమర్పకులు. అది 'ఆ'తో మొదలు అయ్యింది. 'ఆగడు' సినిమా తర్వాత ఆయన సినిమా ప్రయాణం ఆగింది. రమేష్ బాబుకు భార్య మృదుల, ఇద్దరు పిల్లలు భారతి, జయకృష్ణ ఉన్నారు.
Also Read: బుల్లి ‘అల్లురి సీతారామారాజు’గా ఎంట్రీ.. ‘ఎన్‌కౌంటర్’తో వీడ్కోలు, ఇవీ రమేష్ బాబు సినిమాలు
రమేష్ బాబు మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీ శోక సంద్రంలో మునిగింది. కొవిడ్ నేపథ్యంలో అంతిమ కార్యక్రమాలకు హాజరయ్యే శ్రేయోభిలాషులు జాగ్రత్తలు పాటించాలని ఘట్టమనేని ఫ్యామిలీ కోరింది. గుమిగూడవద్దని విజ్ఞప్తి చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ కల్యాణ్ సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read: మహేష్‌బాబు సోదరుడు రమేష్ బాబు కన్నుమూత
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.