సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు (56) శనివారం సాయంత్రం లివర్ వ్యాధితో మరణించారు. ఈయన మృతిపై ఘట్టమనేని కుటుంబం ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘ఘట్టమనేని రమేష్ బాబు మరణించారని ప్రకటించడం ఎంతో బాధాకరంగా ఉంది. ఆయన మా హృదయాల్లో ఎప్పటికీ జీవించి ఉంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, అంత్య క్రియలు జరిగే సమయంలో కోవిడ్ నియమాలు పాటిస్తూ గుంపులుగా చేరవద్దని మా శ్రేయోభిలాషులను కోరుతున్నాం.’ అని ఈ ప్రకటనలో తెలిపారు.
శనివారం సాయంత్రం రమేష్‌బాబు తీవ్ర అస్వస్థతకు లోనవడంతో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రికి ఆయనను తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. అల్లూరి సీతారామరాజు సినిమాతో బాల నటుడిగా రమేష్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 1987లో వచ్చిన సామ్రాట్ హీరోగా ఆయన మొదటి చిత్రం. బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, కృష్ణ గారి అబ్బాయి సహా 20 వరకు సినిమాల్లో ఆయన కథానాయకుడిగా నటించారు. అయితే పరిశ్రమలో కథానాయకుడిగా మాత్రం రాణించలేకపోయారు. 1997లో సూర్యం సినిమా తర్వాత ఆయన అస్సలు సినిమాల్లో నటించలేదు.
కానీ సినిమాల్లో నటించడం ఆపేశాక ఆయన నిర్మాతగా కొనసాగారు. మొదట సూర్య వంశం(హిందీ)కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రమేష్ బాబు వ్యవహరించారు. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాను ఒక్కరే నిర్మించారు. అతిథి సినిమాను యూటీవీ భాగస్వామ్యంతో నిర్మించిన రమేష్ బాబు.. దూకుడు, ఆగడు చిత్రాలకు సమర్పకుడిగా కూడా ఉన్నారు.