టాలీవుడ్ కి చెందిన ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యల కారణంగా వారం రోజుల క్రితం నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో ఆయన్ను చేర్పించగా.. చిత్స పొందుతూ మరణించారాయన.  సుమారు 900 వందలకు పైగా చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పని చేశారు గౌతమ్ రాజు. ప్రస్తుతం తెలుగులో అగ్ర హీరోలుగా ఉన్న వారందరితో ఏదో ఒక చిత్రానికి పని చేశారు. 

 

గౌతమ్ రాజు మృతితో పలువురు ప్రముఖులు షాక్‌కి గురి అయ్యారు. సోషల్ మీడియా వేదికగా గౌతమ్ రాజుకి నివాళులు అర్పిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ నివాళులు అర్పిస్తూ ఎమోషనల్ ట్వీట్స్ పెట్టారు. 

 

''సుమారు 850 చిత్రాలకిపైగా ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించి తెలుగు సినీ ప్రస్థానంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గౌతమ్ రాజు గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం.. నేను నటించిన పలు చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పని చేశారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను'' అని తెలిపారు ఎన్టీఆర్. 

 

రామ్ చరణ్ తన ట్వీట్ లో.. గౌతమ్ రాజు మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని, ఆయన వర్క్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. అలానే ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. నటుడు సాయిధరమ్ తేజ్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ''ఎడిటర్ గౌతమ్ రాజు గారి మరణ వార్త విని నాగుండె  ముక్కలైంది. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి.. అతడి వర్క్ ఇంకా గొప్పగా ఉండేది. నా కెరీర్ మొదట్లో ఆయనతో కలిసి పని చేశాను. మీరు చేసిన వర్క్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి'' అంటూ రాసుకొచ్చారు.