నటి అమీషా పటేల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. కొంతకాలం పాటు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. 2000లో హీరోయిన్ గా సినీ కెరీర్ మొదలు పెట్టింది. తెలుగుతో పాటు హిందీలోకి ఒకేసారి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరితో కలిసి నటించింది. అగ్రతారగా చలామణి అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అక్కడ కూడా సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతోంది. హిందీతో పాటు పంజాబీ సినిమాల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం ఆమె నటించి ‘గదర్ 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నిర్మాణ సంస్థ తీరుపై అమీషా సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగింది.
అమీషా ఆగ్రహానికి కారణం ఏంటంటే?
అమీషా నటించిన తాజా చిత్రం ‘గదర్ 2’ సినిమా షూటింగ్ మేలో పూర్తి అయ్యింది. చివరి షెడ్యూల్ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ వ్యవహార తీరుపై ఆమె నిప్పులు చెరిగింది. సోషల్ మీడియాలో వరుస ట్వీట్లు పెడుతూ తనలోని కోపాన్నిఅంతా బయటపెట్టింది. చివరి షెడ్యూల్ షూటింగ్ లో పడిన బాధలు అన్నింటినీ వెళ్లగక్కింది. ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయిన అనిల్ శర్మ ప్రొడక్షన్స్ కనీసం తమ భోజనం, వసతి, రవాణాకు సంబంధించిన బిల్లులు కూడా చెల్లించలేదని ఫైర్ అయ్యింది. తన పట్లనే కాదు, మొత్తం సినిమా షూటింగ్ బృందం విషయంలోనూ అనిల్ శర్మ ప్రొడక్షన్స్ ఇలాగే వ్యవహరించిందని అమీషా తెలిపింది. మేకప్ ఆర్టిస్టులు, కాస్ట్యూమ్ డిజైనర్లు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బందికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్పింది. షూటింగ్ చివరి రోజున చండీగఢ్ విమానాశ్రయానికి వెళ్లేందుకు కనీసం ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వలేదని వెల్లడించింది. నటీనటులకు కనీసం వాహనాలు సమకూర్చలేదని చెప్పుకొచ్చింది. షూటింగ్ అయ్యాక సిబ్బందిని వదిలేసి నిర్మాణ సంస్థ ప్రతినిధులు వెళ్లిపోయారని చెప్పింది.
జీ స్టూడియోస్ కు అమీషా స్పెషల్ థ్యాంక్స్
విషయం తెలిసి జీ స్టూడియోస్ సంస్థ ప్రతినిధులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సరిదిద్దారని అమీషా తెలిపింది. అనిల్ శర్మ ప్రొడక్షన్స్ చేసిన తప్పులను వారు సరి చేసినట్లు చెప్పుకొచ్చింది. ఈ సమస్యను పరిష్కరించిన షరీక్ పటేల్, నీరజ్ జోషి, కబీర్ ఘోష్, నిశ్చిత్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది. జీ స్టూడియోస్ టీమ్ ఎప్పుడు టాప్ లోనే ఉంటుందని ప్రశంసలు కురిపించింది. సన్నీ డియోల్, అమీషా పటేల్ నటిస్తున్న ‘గదర్ 2’ చిత్ర నిర్మాణ పనులను అనిల్ ప్రొడక్షన్స్ సంస్థ పర్యవేక్షిస్తోంది.
Read Also: సంక్రాంతి బరిలో ‘హనుమాన్’, ఫ్రెష్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్!