గత కొంత కాలంగా సినిమా పరిశ్రమలో వరుస విషాద ఘటనలు జరుగుతున్నాయి. పలువురు ప్రముఖ నటీనటులు, దర్శకనిర్మాతలు, టెక్నీషియన్లు చనిపోతున్నారు. రీసెంట్ గా ‘ఆర్ఆర్ఆర్ఆ‘ చిత్రంలో స్కాట్ దొరగా నటించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్ సన్ కన్నుమూశారు. 58 ఏండ్ల వయసులో ఆయన హఠాన్మరణం పొందారు. షూటింగ్ లో ఉండగానే అస్వస్థతకు గురై చనిపోయారు. ఈ ఘటన మర్చిపోక ముందే మరో హాలీవుడ్ నటుడు చనిపోయారు. గత కొన్ని సంవత్సరాలుగా అద్భుత నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నబుల్లితెర నటుడు, నిర్మాత మాథ్యూ పెర్రీ తుదిశ్వాస విడిచారు. 54 ఏండ్ల వయసున్న ఆయన శనివారం సాయంత్రం లాస్ ఏంజిల్స్ లోని తన సొంత ఇంట్లోనే శవమై కనిపించారు. ఈ విషయాన్ని లాస్ ఏంజిల్స్ టైమ్స్ అధికారికంగా వెల్లడించింది.
గుండె పోటుతో మాథ్యూ పెర్రీ కన్నుమూత
మాథ్యూ ఇంట్లో పడి ఉన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకున్నారు. ఆయను పరిశీలించారు. అయితే, తను అప్పటికే చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన మరణవార్తను కన్ఫామ్ చేశారు. మ్యాథ్యూ పెర్రీ పడిపోయి ఉన్న ప్రదేశంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ కూడా తీసుకుని ఉన్నారేమోనని పరిశీలించారు. కానీ, చివరకు తను డ్రగ్స్ తీసుకోలేదనే నిర్ణయానికి వచ్చారు. మాథ్యూ మృతికి గుండె పోటు కారణం అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇక ఆయన మృతి వార్త తెలియడంతో ఆయన అభిమానులు, సినీ ప్రియులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటుగా అభివర్ణిస్తున్నారు.
పెర్రీ ‘ఫ్రెండ్స్’ సిరీస్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
మాథ్యూ పెర్రీ ‘ఫ్రెండ్స్’ సిరీస్ తో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1994 నుంచి 2004 వరకు 10 సీజన్ల పాటు ప్రసారం అయ్యింది. ఈ సిరీస్ లో మాథ్యూ చాండ్లర్ అనే పాత్రను పోషించారు. ఈ పాత్రతో తనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ సిరీస్ లో అద్భుత నటనకు గాను ఆయనకు రెండుసార్లు ప్రైమ్‌టైమ్ ఎమ్మీ నామినేషన్‌ను అందుకున్నారు. దీంతో మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. ‘ప్రెండ్స్’ సిరీస్ మాత్రమే కాదు, ‘స్టూడియో 60 ఆన్ ది సన్‌సెట్ స్ట్రిప్', 'గో ఆన్', 'ది ఆడ్ కపుల్' లాంటి టీవీ షోలతో బాగా పాపులర్ అయ్యారు. 'ది వెస్ట్ వింగ్' సిరీస్‌లో జో క్విన్సీ పాత్రకు గానూ అత్యుత్తమ గెస్ట్ యాక్టర్ గా 2003, 2004లో రెండు ఎమ్మీ నామినేషన్లు పొందారు.
Read Also: చిరంజీవి సచిన్, పవన్ కల్యాణ్ విరాట్ కోహ్లీ, భలే చెప్పావయ్యా వరుణ్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial