Flautist Naveen Kumar:
ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి అవార్డ్
ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ కంపోజ్ చేసిన బాంబే సినిమా పాటలు వచ్చి పాతికేళ్లు దాటిపోయింది. కానీ ఇప్పటికీ చాలా మంది మ్యూజిక్ లవర్స్ లిస్ట్‌లో ఉంటుంది ఈ ఆల్బమ్. ఇందులోని పాటలన్నీ సూపర్ హిట్టే. అయితే...బాంబే థీమ్ మ్యూజిక్ (Bomaby Music Theme) మాత్రం చాలా స్పెషల్. ఆ ఆర్కెస్ట్రైజేషన్ వింటుంటే గూస్‌బంప్స్ వస్తాయి. వాటిలో ఎక్కువగా వినిపించే ఫ్లూట్ మ్యూజిక్ వేరే లెవెల్‌లో ఉంటుంది. వైజాగ్‌కి చెందిన నవీన్ కుమార్ అనే ఫ్లూటిస్ట్ చేసిన మ్యాజిక్ అది. ఏఆర్ రెహ్మాన్ ఫస్ట్ సినిమా రోజా నుంచి ఆయనతో కలిసి ట్రావెల్ చేస్తున్నారు నవీన్ కుమార్. ఫ్లూటిస్ట్ నవీన్ కుమార్‌గా ఆయన పేరు స్థిరపడిపోయింది. రెహ్మాన్‌తో కలిసి ఇప్పుడు కన్సర్ట్స్ కూడా చేస్తున్నారు. హాలీవుడ్ సినిమా జంగిల్ బుక్‌కి కూడా పని చేశారు నవీన్ కుమార్. ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న ఆయన ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్నారు. అగ్రరాజ్యం అమెరికా ఆయన సేవల్ని గుర్తించి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఆఫీస్ నుంచి ఈ అవార్డు తనకు అందినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నవీన్ కుమార్. ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజు అని ఆనందం వ్యక్తం చేశారు. అమెరికాలో జరిగిన పలు కీలక ఈవెంట్స్‌లో పాల్గొనడమే కాకుండా...అక్కడి మ్యుజీషియన్స్‌కి స్ఫూర్తిగా నిలిచినందుకు ఈ అవార్డు ఇస్తున్నందుకు అమెరికా వెల్లడించింది.
"నాకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఆఫీస్ నుంచి నాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లుగా నాకు అవకాశాలిచ్చి నన్ను ఇంత వాడిని చేసిన సంగీత దర్శకులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. నా ప్రయాణం ఎప్పుడూ మీతోనే. సోషల్ మీడియా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులందరికీ థాంక్స్. ఇది నేనెప్పటికీ మర్చిపోలేని రోజు"
- నవీన్ కుమార్, ఫ్లూటిస్ట్
ఆల్‌ఇండియా రేడియోలో షోలు..
ఇళయరాజా, మణిశర్మ, ఎమ్ఎమ్ కీరవాణి, దేవిశ్రీప్రసాద్, సాజిద్ వాజిద్, సలీమ్ సులేమాన్ ఇలా ప్రముఖ సంగీత దర్శకులందరితోనూ కలిసి పని చేశారు నవీన్ కుమార్. కానీ ఏఆర్ రెహ్మాన్ సినిమాలతో పాపులర్ అయ్యారు. రోజా, బాంబే, దొంగ దొంగ, ప్రేమికుడు ఇలా..ఎన్నో సినిమాల్లో రెహ్మాన్‌తో కలిసి ప్రయాణించారు. "ఫ్లూట్‌తో నేనెప్పుడో ప్రేమలో పడిపోయాను. దాంతో నేను మాట్లాడతాను కూడా" అని చాలా పొయెటిక్‌గా చెబుతారు నవీన్ కుమార్. తొమ్మిదో తరగతిలోనే ఆల్‌ఇండియా రేడియోలో కన్సర్ట్ ఇచ్చారు. వైజాగ్‌లోని ఏయూ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ చదువుకున్నారు. 1984లో తొలిసారి ఇళయరాజాని కలిశానని, ఆ తరవాతే తన లైఫ్ మారిపోయిందని చెబుతుంటారు. ఓ సాదాసీదా ఫ్లూట్‌తో తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన నవీన్ కుమార్ ఇప్పుడు దాదాపు 300 ఫ్లూట్‌లను వాయించగలిగే నైపుణ్యం సాధించారు. మలేషియాలో తొలిసారి కన్సర్ట్ ఇచ్చినప్పుడు బాంబే థీమ్ వాయించినప్పుడు ఆడియెన్స్ ఒక్కసారిగా నిలబడి చప్పట్లు కొట్టిన సందర్భాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని చెబుతారు నవీన్ కుమార్.