కరోనా దెబ్బతో సినిమా పరిశ్రమ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నదని చెప్పుకోవచ్చు. లాక్ డౌన్ తర్వాత సినిమా థియేటర్లకు జనాలు వచ్చేందుకు పెద్దగా ఇష్టపడటం లేదు. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. ఏ సినిమా అయినా.. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. కొన్ని సినిమాలైతే నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. తాజాగా రిలీజ్ అయిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా సైతం చాలా తక్కువ సమయంలోనే ఓటీటీలో స్ట్రీమ్ కాబోతుంది.


కరోనా పాండమిక్ తర్వాత థియేటర్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా ‘జాతిరత్నాలు’. ఈ సినిమాకు దర్శకుడు  అనుదీప్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మూవీని తెరకెక్కించడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలకు ముందు చేసిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. సెప్టెంబర్ 2న ఈ సినిమా రిలీజ్ కాగా.. ఆడియన్స్‌ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది.


ఈ నెల 23(సెప్టెంబర్) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. ఈ సినిమా విడుదలైన కేవలం మూడు వారాలకే ఓటీటీలోకి వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్రేజ్ పెరిగింది. థియేటర్లలో సరిగా వసూళ్లు రాకపోయినా.. ఓటీటీలోనైనా మంచి బిజినెస్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు.


ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమాలో ఓ యువకుడు పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. పవన్ నటించిన  ఖుషి సినిమాకు సంబంధించిన ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు సొంతం చేసుకునేందుకు ఎలాంటి పాట్లు పడ్డాడు అనేది కథ. ఈ స్టోరీ యువతకు బాగా ఆకట్టుకుంటుందని సినీ జనాలు భావిస్తున్నారు. సినిమా థియేటర్లలో ఈ సినిమాను చూడని వారు ఓటీటీలో కచ్చితంగా  చూస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ఈ సినిమాలో శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు హీరో, హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి  కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమాకు ఆహాలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే సెప్టెంబర్ 23 వరకు వేచి చూడాల్సిందే! ఇటీవలే తెలుగు  సినిమా  విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే  డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్  ద్వారా విడుదల చేయాలంటూ నిర్మాతలు తీర్మానించారు. కానీ, ఈ సినిమా మూడు వారాలకే విడుదల కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వారం ముందే అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది.