ఆరుద్ర సతీమణి, ప్రముఖ రచయిత్రి కె.రామలక్ష్మి శుక్రవారం మధ్యాహ్నం వయోభారంతో కన్నుమూశారు. ఆమెకు 92 సంవత్సరాల వ‌య‌స్సు. ఆమె అంత్య‌క్రియ‌ల‌ను హైద‌రాబాద్ లోనే నిర్వ‌హించారు. ఆమె మ‌ర‌ణ‌వార్త తెలిశాక ప‌లువురు ప్ర‌ముఖులు మలక్‌పేటలో ఉన్న ఆమె నివాసానికి వెళ్లి పార్దివ దేహంపై పూల‌దండ‌లు వేసి నివాళుల‌ర్పించారు.


కె.రామలక్ష్మి 1930 సంవత్సరం డిసెంబరు 31వ తేదీన కోటనందూరులో జన్మించారు. ఆమె మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందారు. 1951 నుంచి రామలక్ష్మి రచనలు ప్రారంభించారు. ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్ర సాహిత్యాలను ఆవిడ చదివారు. తెలుగు స్వతంత్రలో ఇంగ్లీషు విభాగానికి ఉపసంపాదకులుగా కూడా రామలక్ష్మి పనిచేశారు.


అనేక స్త్రీ సంక్షేమ సంస్థల్లో విధులు నిర్వర్తించారు. 1954 సంవత్సరంలో కవి, సాహిత్య విమర్శకుడు ఆరుద్రతో రామలక్ష్మికి వివాహమైంది. ఆ తర్వాత ‘రామలక్ష్మి ఆరుద్ర’ కలం పేరుతో ఆవిడ ఎన్నో రచనలు చేశారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఆరుద్ర 1998లో మరణించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మలక్‌పేటలో నివాసముంటున్న ఆమె వయోభారంతో కన్నుమూశారు.