పాపం ఖుషి తను ఏం తప్పు చేసిందనమ్మ ఈ గొడవల మధ్య నలిగిపోతుందని వేద తల్లడిల్లిపోతుంది. మరి నువ్వేం తప్పు చేశావని నువ్వు నలిగిపోవాలి వేద అని సులోచన ఆవేదన చెందుతుంది. నీ భర్తే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు, నీ మంచితనమే నీకు శ్రీ రామరక్ష అని వేదకి ధైర్యం చెప్తుంది. వేద జరిగిందంతా తలుచుకుని బాధపడుతుంటే వెనుక నుంచి కైలాష్ వచ్చి భయపెడతాడు. 'నా గురించి నా భర్యకి, అత్తగారికి చెప్పాలని ట్రై చేశావ్ పని కాలేదు, పోలీసుల దగ్గరకి వెళ్లావ్ పని కాలేదు, నీ భర్తకి చెప్పాలని చూశావ్ ప్రయోజనం లేకుండా పోయింది. దీన్ని బట్టి నేకు ఏమర్థమైంది ఇంట్లో నీ కంటే నాకే బలం ఎక్కువ. ఆ దేవుడు నన్ను నీకోసమే పుట్టించాడు' అని నోటికొచ్చినట్టు వాగుతాడు. ఆ మాటకి వేద చెప్పు తీసుకుని కొడతా, ఆడదంటే ఓపిక, కానీ ఏదో ఒక రోజు తనకు తానుగా ఓపికని వదిలేసిందంటే తట్టుకోలేక ప్రపంచం తల్లకిందులవుతుంది. వేద రూపంలో నీకు చావు వచ్చిందని కైలాష్కి వార్నింగ్ ఇస్తుంది. కానీ కైలాష్ మాత్రం నా నుంచి నిన్ను ఎవరు కాపాడలేరు అని అంటాడు. ఇక కైలాష్ వేదతో మాట్లాడి వెనక్కి తిరిగేసరికి అక్కడ యష్ ఉంటాడు. వాళ్ళ మాటలు విన్నాడేమో అని కైలాష్ కాస్త టెన్షన్ పడతాడు.
చెల్లెమ్మకి సారీ చెప్పడానికి వచ్చాను బావ అని కవర్ చేసేందుకు ట్రై చేస్తాడు. కాళ్ళు పట్టుకుని ఇంటికి రమ్మని పిలిచాను కానీ తను రాను అని గట్టిగా అరుస్తుంది, పెద్ద మనసు చేసుకుని తనని క్షమించు బావ, తన భార్య ఇలాంటి పని చేసిందని తెలిసి కాపురం చేయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ త్యాగం చేసి నా చెల్లెమ్మని చెరదీస్తే నాకు అంతకంటే సంతోషం ఏముంటుందని కల్లబొల్లి మాటలు చెప్తాడు. వెల్లగొట్టిన నా చెల్లిని మళ్ళీ ఇంటికి తీసుకురా అని అంటాడు. యష్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ వేదకి తన భర్త అండ లేకుండా చేయాలని కైలాష్ అనుకుంటాడు.
యష్, అభిమన్యు ఎదురుపడతారు. 'ఏంటి వేద నిన్ను వదిలేసిందంట కదా, నీ పాత పెళ్ళాం నయం కొన్నేళ్ళపాటు అయిన కాపురం చేసింది. నీ కొత్త పెళ్ళాం ఏంటి కొన్ని రోజులు కూడా కాపురం చేయలేదు. అప్పుడు నీ దగ్గర డబ్బు లేదు మాళవిక వదిలేసింది.. ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉంది కదా మరీ వేద ఎందుకు వదిలేసింది' అని రెచ్చగొట్టేలాగా మాట్లాడతాడు. నీ వంకర తిరుగుళ్ళకి విసిగిపోయి ఏదో ఒక రోజు మాళవిక వెళ్లిపోతుందని కూల్ గా యష్ సమాధానం చెప్తాడు. నా దృష్టిలో నువ్వొక బఫూన్ గాడివి అని యష్ వెళ్ళిపోతాడు. ఇక మాలిని, సులోచన మధ్య మళ్ళీ గొడవ మొదలవుతుంది. నా కూతుర్ని నీ గడప తొక్కనివ్వను, మా బుద్ధి గడ్డి తిని మీ మలబార్ ఫ్యామిలికి మా పిల్లనిచ్చామని సులోచన తిడుతుంది. అలా ఇద్దరి మధ్య కాసేపు వాదులాట జరుగుతుంది.
Also Read: వసు విషయంలో ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్న రిషి, వేగంగా పావులు కదుపుతున్న దేవయాని-సాక్షి
ఇక వసంత్ వచ్చి యష్ ని నిలదీస్తాడు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావని అడుగుతాడు. వేద అంటే నిజాయితీ అలాంటి వేద విషయంలో నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావ్, నాతో అయిన సమాధానం చెప్పు అని బ్రతిమలాడతాడు. నీ భార్య మీద నింద పడితే నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావ్, నీ మనసులో ఏముందని పదే పదే అడుగుతాడు. కానీ యష్ ఏం చెప్పకుండానే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక మాళవిక ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్ దగ్గరకి వస్తుంది. మా ఖుషి కస్టడీ గురించి మాట్లాడటం కోసం వచ్చానని చెప్తుంది. కోర్ట్ ను మోసం చేసి వేద, యష్ డ్రామా ఆడారు. నా కూతుర్ని నా నుండి దూరం చేశారు. యశోదర్, వేద భార్య,భర్తలుగా కలిసి లేరు కావాలంటే స్వయంగా మీరే వచ్చి చూడండి అని ఏడుస్తూ నాటకమాడుతుంది. ఆ మాటలు విన్న జడ్జ్ తానే స్వయంగా వస్తానని అంటుంది. ఒకవేళ యశోదర్, వేద నిజంగా విడిపోయి వేరు వేరు ఇళ్ళల్లో ఉంటే నేనే అప్పటికప్పుడు ఖుషిని మీకు అప్పగిస్తానని మాట ఇస్తుంది.