టాలీవుడ్(Tollywood) హీరో నవదీప్‌(Navadeep)కు ఈడీ(Enforcement Directorate) నోటీసులు జారీ చేసింది.  ఈ నెల 10న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. మాదాపూర్ మాదక ద్రవ్యాల కేసులో నవదీప్​కు నోటీసులు ఇచ్చినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వెల్లడించారు. 


హైదరాబాద్​(Hyderabad)లోని మాదాపూర్​ మాదక ద్రవ్యాల కేసు(Drugs Case)లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. నిందితుల ఫోన్ డేటా సాయంతో మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. నిందితుల కాల్ డేటాలో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే ఇప్పటికే టాలీవుడ్ నటుడు నవదీప్​ను విచారించారు. ఇప్పుడు ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో నటుడు నవదీప్​కు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీన ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ అధికారులు పేర్కొన్నారు. 


నిందితుల కాల్ డేటాలో టాలీవుడ్ ప్రముఖులు


మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బాలాజీ, రాంకిశోర్‌, కల్హర్‌రెడ్డి సెల్‌ఫోన్ల డేటాలో...టాలీవుడ్ కు చెందిన ప్రముఖుల ఫోన్‌ నంబర్లను పోలీసులు గుర్తించింది. ప్రముఖుల ఫోన్ నంబర్లు ఉండటంతో...డ్రగ్స్ దందాతో వారికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా ? ఉంటే ఎలాంటి సంబంధాలు సినిమా రంగానికే పరిమితమా ?  లేదంటే డ్రగ్స్ తీసుకుంటున్నారా ? అన్నకోణాల్లో పోలీసులు కూపీ లాగుతున్నారు. నిందితుల నుంచి మరింత సమాచారం సేకరిస్తోంది. నిర్మాతలు ఉప్పలపాటి రవి, వెంకటరత్నారెడ్డిలకు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ నేవీ ఉద్యోగి బాలాజీ, విశాఖపట్నానికి చెందిన రాంకిశోర్‌ ద్వారా డ్రగ్స్‌ చేరేవి. బెంగళూరు నుంచి కొకైన్‌, హెరాయిన్‌, ఎల్‌ఎస్‌డీ బ్లాట్లు తీసుకొచ్చేందుకు రాంకిశోర్‌ సహకరించేవాడు. బెంగళూరులో ఉంటున్న నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి...హైదరాబాద్ లో సినీ, రాజకీయ ప్రముఖులకు విక్రయిస్తున్నారు. మాదాపూర్‌, గచ్చిబౌలిలోని అపార్టుమెంట్లను అద్దెకు తీసుకుని పార్టీలు నిర్వహించేవారు. మోడళ్లు, సినిమా ఛాన్స్ ల అవకాశాల కోసం ఎదురుచూసే అమ్మాయిలను డ్రగ్స్ ఎరవేసి పార్టీలకు ఆహ్వానించేవారు. 


సరుకు ఆర్డర్‌కు బకరా.. కోక్‌.. శాండిల్‌ వంటి కోడ్‌ భాష ఉపయోగిస్తున్నారు. నగదు చేతిలో పడ్డాక మాత్రమే సరుకు ఎక్కడ తీసుకోవాలో సమాచారం ఇస్తారు. ముందుగా నిర్ణయించిన కిరాణా, పాన్, పాల దుకాణాల వద్ద డ్రగ్స్‌ ప్యాకెట్లు అందజేస్తారు. దీనికి ప్రతిఫలంగా దుకాణదారులకు కొంత కమీషన్‌ ముట్టజెబుతున్నారు. కొన్ని ముఠాలు నిర్మానుష్య చీకటి ప్రదేశాలల్లో పొట్లాలు ఉంచి దూరంగా ఉండి గమనిస్తారు. ఇరువైపుల లావాదేవీలు పూర్తయినట్లు ధ్రువీకరించేందుకు ‘బ్రో’ అనే సిగ్నల్స్ ఉపయోగిస్తున్నట్లు తెలింది.


2017లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు వచ్చింది. ఈ కేసులో పలువురు సినీ హీరోలతో పాటు హీరోయిన్లను విచారించింది ఈడీ. ఈ కేసులో నవదీప్ కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే విచారణకు నవదీప్ హాజరుకాలేదు. తాజాగా మాదాపూర్ డ్రగ్స్ తెరపైకి వచ్చిన నేపథ్యంలో.... ఈడీ ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం.