న్నడ స్టార్ హీరో దివంగత పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన 'కర్ణాటక రత్న'ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పునీత్ భార్య అశ్విని అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీ కాంత్, ఇన్ఫోసిస్ ఛైర్ పర్సన్ సుధా మూర్తి, నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడారు.. కర్ణాటక ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కన్నడ ప్రజలకు ‘కర్ణాటక రాజ్యోత్సవ’ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగించారు. ‘‘నేను ఇక్కడికి అతిథిగా కాదు అప్పు స్నేహితుడిగానే వచ్చాను. ఎవరైనా కుటుంబ పెద్దల నుంచి ఇంటి పేరునో వారసత్వాన్నో పొందుతారు. కానీ వ్యక్తిత్వాన్ని మనమే సంపాదించుకోవాలి. అహంకారం లేని వ్యక్తిత్వం, ఎప్పుడూ చిరునవ్వుతో యావత్ రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకున్న వ్యక్తి పునీత్ రాజ్ కుమార్. అందుకే ఈ అవార్డు ఆయనకు దక్కింది. అతని నవ్వులో ఉన్న సంపద ఇంకెక్కడా దొరకదు’’ అని అన్నారు. 


స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ కర్ణాటకలో గొప్ప సూపర్ స్టార్, ఒక గొప్ప కొడుకు, ఒక గొప్ప తండ్రి, ఒక గొప్ప ఫ్రెండ్ ఒక గొప్ప యాక్టర్, డ్యాన్సర్, సింగర్ వీటన్నిటికి మించి ఒక గొప్ప మానవతావాది  అని ఎన్టీఆర్ అన్నారు. తన ఉద్దేశంలో కర్ణాటక రత్న అంటే అర్థమే పునీత్ రాజ్ కుమార్ అని అన్నారు ఎన్టీఆర్. పునీత్ గురించి ఎన్టీఆర్ కన్నడలో మాట్లాడటం విశేషం. 


పునీత్ రాజ్ కుమార్ ప్రథమ వర్ధంతి సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం ఈ అవార్డు ప్రదానోత్సవానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కార్యక్రమం మొదలైన కాసేపటికే అక్కడ జోరున వర్షం పడింది. పునీత్ పై ప్రేమతోనే వాన పడిందా అన్నట్లు మారింది అక్కడి వాతావరణం. అలాగే కార్యక్రమం ప్రారంభం అయింది.  ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో కూడా వర్షం పడుతూనే ఉంది. అయినా కార్యక్రమం అట్టహాసంగా సాగింది. 


పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఆయన అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో మరణించారు. పునీత్ రాజ్ కుమార్ ను క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మలో ప‌వ‌ర్ స్టార్, అప్పు అని ముద్దుగా పిలుచుకుంటారు అభిమానులు. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తన విలక్షణ నటన, వ్యక్తిత్వం తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పునీత్. ఐదేళ్ల వ‌య‌సులోనే పునీత్ సినీ రంగ ప్ర‌వేశం చేశారు. పునీత్‌ రాజ్‌కుమార్ 1976లో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. తండ్రి రాజ్ కుమార్‌తోనూ క‌లిసి న‌టించారు పునీత్. బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళు విరామం తీసుకున్నారు. తర్వాత 2002 లో 'అప్పు' సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు పునీత్. కేవలం సినిమాలతోనే కాకుండా  సేవా కార్యక్రమాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేశారు పునీత్ రాజ్ కుమార్.




Also Read: ఒక్క శుక్రవారం - ఐదుగురు అందగత్తెలకు అగ్ని పరీక్ష - హిట్ కొట్టేది ఎవరు? ఛాన్సలు పట్టుకునేది ఎవరు?