Dunki Movie Special Screening For Consulates: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. ఇప్ప‌టికే ‘పఠాన్‘, ‘జవాన్‘ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న ఆయన, తాజాగా ‘డంకీ‘ సినిమాతో హ్య‌ట్రిక్ హిట్ అందుకున్నారు. దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 21న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే, మొదటి రోజు అంతగా కలెక్షన్స్ సాధించకపోయినా, నెమ్మదిగా జోరందుకున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర భారీగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఇప్ప‌టికే ఈ చిత్రం రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నది.


కాన్సులేట్స్ కోసం స్పెషల్ స్క్రీనింగ్


ఇక ఇప్పటికే ఈ సినిమా అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక రాష్ట్రపతి భవన్ లో ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు మేకర్స్. రాష్ట్రపతి భవన్ లోని సిబ్బంది కోసం ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. భారత్ లోని అన్ని దేశాలకు చెందిన కాన్సులేట్స్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నెల 28న ఢిల్లీలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, బెల్జియం, జర్మనీ, వియత్నాం, మలేషియా, థాయ్ లాండ్, స్పెయిన్, టర్కీ, నెదర్లాండ్స్ సహా పలు దేశాలకు చెందిన కాన్సులేట్ జనరల్స్ ఈ ప్రదర్శనకు హాజరుకానున్నారు. అక్రమ వలసలను హైలెట్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే కాన్సులేట్స్ కు ఈ మూవీ చూపించాలని మేకర్స్ నిర్ణయించారు.   


‘డంకీ‘ సినిమా గురించి..


ఒకదేశం నుంచి మరొక దేశానికి అక్రమంగా ఎలా ప్రయాణిస్తారు అనేది ‘డంకీ‘ సినిమాలో చూపించారు మేకర్స్. ఈ చిత్రంలో తాప్సీ పన్ను హీరోయిన్ గా నటించింది. విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్‌ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. షారుఖ్ ఖాన్, తాప్సీ పన్ను తొలిసారి  స్క్రీన్‌ షేర్ చేసుకున్నారు. అభిజత్ జోషి, కనికా ధిల్లాన్‌ స్క్రీన్‌ ప్లే రాశారు. రాజ్‌ కుమార్ హిరానీ ఫిల్మ్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ సమర్పిస్తోంది. ప్రీతమ్ సంగీతం అందించారు. డిసెంబర్ 21న థియేటర్లలోకి అడుగు పెట్టిన ఈ సినిమా ప్రభాస్ ‘సలార్‌‘తో  పోటీ పడుతోంది. అయితే, ‘డంకీ‘తో పోలిస్తే ‘సలార్‘ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. వసూళ్ల పరంగానూ ‘సలార్’ దూసుకెళ్తోంది.  






Read Also: 'సరిహద్దులు చెరిగిపోతున్నాయి.. ఇండియన్ ఫిల్మ్ రేంజ్ పెరుగుతోంది' ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్