పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), కమెడియన్ అలీ(Ali) మంచి స్నేహితులనే సంగతి అందరికీ తెలిసిందే. 'తొలిప్రేమ' నుంచి 'కాటమరాయుడు' వరకు పవన్ నటించిన చాలా సినిమాల్లో అలీ కనిపించారు. అలీ లేకపోతే తన సినిమాల్లో ఏదో వెలితిగా ఉంటుందని పవన్ ఓ సందర్భంలో చెప్పారు. అలీతో తనకున్న స్నేహం గురించి పవన్ చాలా సార్లు మాట్లాడారు. అయితే వీరిద్దరి మధ్య రాజకీయం చిచ్చు పెట్టింది. పవన్ కళ్యాణ్ పెట్టిన 'జనసేన'లో కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అలీ. 


అంతేకాదు.. ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. ఈ విషయం పవన్ కి నచ్చలేదు. అందుకే బహిరంగంగానే అలీపై అసంతృప్తిని వెళ్లగక్కారు. ఆ సమయంలో అలీ కూడా కాస్త ఘాటుగానే స్పందించారు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఈ మధ్యకాలంలో మళ్లీ ఇద్దరు కలిసిపోయినట్లు సమాచారం. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలీ.. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. 


పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎందుకు నటించడం లేదని అలీని ప్రశ్నించగా.. 'వకీల్ సాబ్', 'భీమ్లానాయక్' వంటి సినిమాలు సీరియస్ గా సాగుతాయని.. వాటిలో కామెడీకి స్కోప్ లేదని అన్నారు. ఆ సినిమాల్లో వేరే కమెడియన్స్ కూడా లేరనే విషయాన్ని గ్రహించాలని అన్నారు. పవన్ నెక్స్ట్ చేయబోయే సినిమాల్లో కచ్చితంగా తను నటిస్తానని.. తమ మధ్య ఏ గ్యాప్ లేదని చెప్పుకొచ్చారు అలీ. 


ఇదే సమయంలో తను హోస్ట్ చేస్తోన్న 'అలీతో సరదాగా' షోకి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చే ఛాన్స్ ఉందని అన్నారు మళ్లీ. తన స్నేహితుడిని ఇప్పటివరకు షోకి తీసుకురాలేకపోయానని.. కానీ కచ్చితంగా ఆయనతో ఎపిసోడ్ ఉంటుందని చెప్పారు అలీ. 'అన్ స్టాపబుల్' షోలో పవన్ పాల్గొంటారని జరుగుతున్న ప్రచారంపై అలీని ప్రశ్నించగా.. దాని గురించి తనకు తెలియదని అన్నారు. 


Also Read : మెగాస్టార్ కోసం కదిలొచ్చిన కాలేజ్ - ఆరు వేల మంది విద్యార్థులతో చిరు 'వాల్తేర్ వీరయ్య' లుక్


ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్(Nidhi Aggerwal) కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి(Nargis Fakri) కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్(Megaproductions) పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మొదట ఈ దసరాకి సినిమా వస్తుందన్నారు. ఆ తరువాత 2023 సంక్రాంతికి విడుదలయ్యే ఛాన్స్ ఉందన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను 2023 మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం(AM Ratnam) రిలీజ్ డేట్ విషయాన్ని బయటపెట్టారు.


ఈ సినిమాతో పాటు తమిళ సినిమా 'వినోదయ సీతమ్'(Vinodhaya Sitham) రీమేక్ లో నటించడానికి పవన్ అంగీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సముద్రఖని(Samuthirakani) ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో పవన్ తో పాటు సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) కూడా నటించనున్నారు. మూడు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని పవన్ టార్గెట్ గా పెట్టుకున్నారు.