వికారాబాద్ సమీపంలోని రిసార్ట్స్ లో నిర్వహకులు నిర్వహించిన ఓ వింత డేంజర్ గేమ్ లో వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. పారవేసిన వస్తువులను తీసుకురావడమే ఆ డేంజర్ గేమ్ టార్గెట్ అని అందులో పాల్గొన్నవారు తెలిపారు. వికారాబాద్ సమీపంలోని గోధుమగూడ లో హైదరాబాద్ అడ్వంచర్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ మూన్ లైట్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ గేమ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి నిన్న సాయంత్రం (అక్టోబరు 29) వంద మందికి పైగా యువకులు రిసార్ట్స్ కి చేరుకున్నారు.


అయితే, ఆ వస్తువులను రిసార్ట్స్ నిర్వహకులు బావిలో దాచిపెట్టారు. అందుకోసం వ్యక్తి బావిలో దూకినట్లుగా తెలుస్తోంది. సాయి కుమార్ (34) అనే వ్యక్తి బావిలో దూకడంతో మృతి చెందాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేసే సాయి కుమార్‌కి ఇటీవలే బాబు కూడా పుట్టాడు. జరిగిన ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బావిలో పడిన వ్యక్తి శవాన్ని బయటికి తీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు.


నగరంలోని వారు సరదాగా గడిపేందుకు వికారాబాద్ చుట్టూ ఎన్నో ఫాంహౌస్‌లు, రిసార్ట్‌లు పుట్టగొడుగుల్లా వెలిసిన సంగతి తెలిసిందే. అయితే, అనుమతి లేకుండా మూన్ లైట్ ను హైదరాబాద్ అడ్వంచర్ క్లబ్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.


వీకెండ్స్ లో ఇలాంటి కార్యక్రమాలు


వీకెండ్స్ లో సరదాగా గడుపుదామని వస్తే ఈ ఘోరం జరిగింది. అడ్వెంచర్ క్లబ్ అనే రిసార్ట్ లో టూరిస్టులకు ప్రాణాలు తీసే ప్రమాదకరమైన ఆటలను ఆడిస్తూ డబ్బు పోగేసుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని అంటున్నారు. వారి నిర్లక్ష్యమే ఈ రోజు ఒక నిండు ప్రాణాన్ని తీసిందని విమర్శిస్తున్నారు. 


సికింద్రాబాద్ కి చెందిన సాయికుమార్ వయసు 35 వీకెండ్స్ లో ఎంజాయ్ చేద్దామని ఫ్రెండ్స్ తో గోధుమ గూడ అడ్వెంచర్ క్లబ్ కి వచ్చాడు. ఆటలో భాగంగా బావిలోకి దిగి ప్రాణాలు కోల్పోయాడు. రిసార్ట్ యాజమాన్యం ఎలాంటి ముందస్తు భద్రతా చర్యలు తీసుకోకుండా ఇక్కడికి వచ్చే కస్టమర్ల ప్రాణాలతో చెలగాటలాడుతుందని పోలీసులు తెలిపారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి రిసార్టులపై చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు కోరుతున్నారు.