మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను(RC15) రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కాకుండా 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నారు చరణ్. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.


అయితే కొన్నాళ్లుగా ఈ సినిమా ఆగిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గౌతమ్ తిన్ననూరి రీమేక్ చేసిన 'జెర్సీ' సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. సరైన కలెక్షన్స్ రాలేదు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో రామ్ చరణ్ ఆలోచనలో పడ్డాడని.. గౌతమ్ తో తన సినిమాను హోల్డ్ లో పెట్టే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. దీనిపై 'ఆచార్య' సినిమా ప్రమోషన్ లో స్పందించిన చరణ్.. గౌతమ్ తో సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. 


కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. చరణ్-గౌతమ్ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. దానికి చాలా కారణాలే ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా గౌతమ్ తిన్ననూరి ఇచ్చిన ఫైనల్ నేరేషన్ తో చరణ్ సంతృప్తి చెందలేదట. పైగా ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఉండడం.. పాన్ ఇండియా సబ్జెక్ట్ ని గౌతమ్ ఎలా హ్యాండిల్ చేయగలడనే సందేహాలతో ఇప్పుడు ఈ సినిమాను పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. 


ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించాలనుకుంది. ఇప్పటికీ ఆ బ్యానర్ లో వర్క్ చేయడానికి చరణ్ సముఖంగానే ఉన్నారట. దీంతో యూవీ సంస్థ ఇప్పుడు చరణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా సినిమాను తెరకెక్కించే దర్శకుల కోసం వేట మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరి గౌతమ్ తిన్ననూరికి మరో హీరో దొరుకుతారో లేదో చూడాలి. 


ఇక చరణ్ 'RC15' సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనేది శంకర్ ప్లాన్. కానీ సడెన్ గా ఆయన 'ఇండియన్ 2' సినిమాను రీస్టార్ట్ చేయడంతో చరణ్ సినిమాను పక్కన పెట్టినట్లు వార్తలొచ్చాయి. మొన్నామధ్య ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు శంకర్. 'ఇండియన్ 2', 'RC15' సినిమాలను సమాంతరంగా చిత్రీకరించబోతున్నట్లు చెప్పారు. చరణ్ సినిమా కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ మొదటి వారంలో స్టార్ట్ చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్, వైజాగ్ లలో సినిమాను చిత్రీకరించబోతున్నట్లు చెప్పారు.


ఒకేసారి శంకర్ రెండు భారీ ప్రాజెక్ట్స్ ను టేకప్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. చరణ్ అభిమానులు తమ హీరో సినిమా క్వాలిటీ దెబ్బ తింటుందేమోనని భయపడుతున్నారు. కానీ శంకర్ మాత్రం తన సినిమాలను తెరకెక్కించే విషయంలో ఫుల్ క్లారిటీతోనే ఉన్నట్లు ఉన్నారు. మరి ఈ సినిమాల రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి!