మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తో సినిమా చేయాలనేది డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath Director) కల. ఇప్పుడు కాదు... ఎప్పటి నుంచో చిరంజీవితో సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. రామ్ చరణ్‌ను 'చిరుత'తో హీరోగా పరిచయం చేయడాని కంటే ముందు నుంచి చిరంజీవికి కథలు చెబుతున్నారు. ఏదీ ఓకే కాలేదు. ఆఖరికి, మెగాస్టార్ రీఎంట్రీ సమయంలో కూడా 'ఆటో జానీ' అని ఓ కథ చెప్పారు. అదీ చేయడం కుదరలేదు. ఇన్నాళ్ళకు పూరి కల నెరవేరబోతోందని ఫిల్మ్ నగర్ టాక్.
 
చిరును కలిసిన పూరి
చిరంజీవిని ఈ మధ్య పూరి జగన్నాథ్ కలిశారని తెలిసింది. సినిమా చేసే విషయమై డిస్కస్ చేశారట. మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ నటించిన సినిమా 'గాడ్ ఫాదర్'. అందులో పూరి జగన్నాథ్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఆయన ఇన్వెస్టివేటివ్ జర్నలిస్టుగా నటించారు. ఆ సినిమా విడుదల సమయంలో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చేశారు. అప్పుడు ఇద్దరి మధ్య సినిమా డిస్కషన్ వచ్చింది. అది ఇప్పుడు పట్టాలు ఎక్కుతోందని సమాచారం అందుతోంది.


'లైగర్' డిజాస్టర్ అయినా సరే!
'లైగర్' డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా అంటే హీరోలు ముఖం చాటేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేసిన 'జన గణ మణ'ను పక్కన పెట్టేశారు విజయ్ దేవరకొండ. ఈ సమయంలో పూరికి చిరు ఛాన్స్ ఇస్తున్నారనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ మధ్య 'వాల్తేరు వీరయ్య' సెట్స్‌లో చిరు, పూరి మీటింగ్ జరిగిందని టాక్. స్క్రిప్ట్ రెడీ చేయమని పూరికి చిరు చెప్పారట. 


ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుందా?
స్క్రిప్ట్ రెడీ అయ్యి, అంతా ఓకే అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేద్దామని పూరికి చిరు అభయం ఇచ్చారట. పూరి జగన్నాథ్ స్పీడు గురించి ప్రేక్షకులకు తెలిసింది. సెట్స్ మీదకు వెళితే ఆలస్యం ఉండదు. చక చకా తీస్తారు. ఫిబ్రవరిలో మొదలైతే వేసవి తర్వాత విడుదల చేసేయొచ్చు. ఏం జరుగుతుందో చూడాలి. 


Also Read : అమెరికాలో ఎన్టీఆర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్


'గాడ్ ఫాదర్'లో పూరి నటించినప్పుడు "వెండితెరపైన నటుడిగా వెలుగు వెలగాలని నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేశాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ, అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా! అందుకే, నా పూరి జగన్నాథ్‌ను ఓ ప్రత్యేక పాత్రలో పరిచయం చేస్తున్నాను" అని 'గాడ్ ఫాదర్' సెట్స్‌లో దిగిన ఫొటోను చిరంజీవి ట్వీట్ చేశారు.


సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'గా జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత 'భోళా శంకర్' కంప్లీట్ చేస్తారు. 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా అనుకున్నా... దాన్ని పక్కన పెట్టేశారు.  ఇప్పుడు ఆ సినిమా ప్లేసులో పూరి జగన్నాథ్ సినిమా చేసే ఛాన్స్ ఉంది. పూరి తరహా సినిమా చేయాలని చిరంజీవి ఆశపడుతున్నారట.