Harish Shankar Vs Chota K Naidu: సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోట కె నాయుడుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ హరీష్ శంకర్. పలు ఇంటర్వ్యూలలో తనను కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటి వరకు సహించినా, ఆయన అలాగే తన మీద నిందలు మోపుతున్నారని ఫైర్ అయ్యారు. ఇకపై తన గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.


ఇంతకీ ఏం జరిగిందంటే?


సినిమాటోగ్రాఫర్ చోట కె నాయుడు గత కొద్ది రోజులు పలు ఇంటర్వ్యూలో ఇచ్చారు. ఇందులో దర్శకుడు హరీష్ శంకర్ గురించి ప్రస్తావించారు. రీసెంట్ గా ఓ చానెల్ తో మాట్లాడిన ఆయన సందర్భం కాకపోయినా, హరీష్ శంకర్ పేరు ప్రస్తావించారు నాయుడు. జూనియర్ ఎన్టార్ హీరోగా తెరకెక్కిన ‘రామయ్య వస్తావయ్యా‘ సినిమా షూటింగ్ సమయంలో తన మాటలను హరీష్ శంకర్ పట్టించుకోలేదన్నారు. సినిమాకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణలో కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చానన్నారు. మరికొన్ని విషయాల్లో నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదన్నారు. చాలా సార్లు కోపం వచ్చినా చివరకు తను చెప్పిందే చేశానని వివరించారు. తాజాగా తన గురించి నాయుడు మాట్లాడిన మాటలను హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. “మీతో పని చేసిన అనుభవం నన్ను బాధ పెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందుకే మీ మీద ఇంకా నాకు గౌరవం ఉంది. దయచేసి ఆ గౌరవాన్ని అలాగే కాపాడుకోండి” అంటూ హెచ్చరించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.   


హరీష్ శంకర్ బహిరంగ లేఖలో ఏం ఉందంటే?


“(వయసులో పెద్ద కాబట్టి) గౌరవనీయులైన చోట కె నాయుడుగారికి నమస్కరిస్తూ.. రామయ్య వస్తావయ్యా సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. ఈ పదేళ్లలో ఉదాహరణకి మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే, నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా. కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా నీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానంగా మాట్లాడారు. మీకు గుర్తుందో లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్ తో షూటింగ్ చేద్దాం అన్న ప్రస్తావన వచ్చింది. కానీ, రాజుగారు చెప్పడం మూలంగానో గబ్బర్ సింగ్ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్‌ని తీసేస్తున్నాడని పదిమంది పది రకాలుగా మాట్లాడుకుంటారని మథనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు. ఎందుకంటే, ‘గబ్బర్‌సింగ్’ వచ్చినప్పుడు నాది ‘రామయ్య వస్తావయ్య’ వస్తే అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది. మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, నా ప్రస్తావన రాకున్నా, నాకు సంబంధం లేకున్నా, నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇలా చాలాసార్లు జరిగినా, నేను మౌనంగానే బాధపడ్డా. కానీ. నా స్నేహితులు అవ్వచ్చు, లేదా నన్ను అభిమానించే వాళ్లు అవ్వచ్చు, నా ఆత్మ అభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తుంది. మీతో పని చేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి.ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు కూడదు మళ్లీ కెలుక్కుంటాను అని అంటే.. ఎనీ డే, ఎనీ ఫ్లాట్ ఫారమ్, ఐయామ్ వెయిటింగ్. భవదీయుడు హరీష్ శంకర్” అని రాసుకొచ్చారు.  


Also Read: ప్రియదర్శి-నభా నటేష్‌ సోషల్ మీడియా రచ్చకు ఎండ్‌ కార్డ్‌ - 'డార్లింగ్‌' మూవీ గ్లింప్స్‌తో క్లారిటీ ఇచ్చేశారు!