Bommarillu Bhaskar: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ సినిమా అప్పట్లో అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ‘మగధీర’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ చిత్రం మ్యూజికల్ గా హిట్ అయినా కలెక్షన్ల పరంగా సత్తా చాటలేకపోయింది. అయితే చాలా ఏళ్ళ తర్వాత రామ్ చరణ్ 38వ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రెండు రోజుల పాటు(మార్చి 25, 26) రీ రిలీజ్ చేశారు. ఈ రెండు రోజులు ఎవరూ ఊహించని విధంగా సినిమాకు కలెక్షన్లు వచ్చాయి. అయితే ఈ సినిమా టైటిల్ గురించి మాత్రం ముందు నుంచీ అందరికీ సందేహాలు ఉన్నాయి. మూవీకు ‘ఆరెంజ్’ అనే టైటిల్ ను ఎందుకు పెట్టారు అంటూ నెటిజన్స్ ఆరా తీశారు. ఇప్పటి వరకూ దర్శకుడు దానిపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాటా మూవీ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఆరెంజ్’ సినిమాకు ఆ టైటిల్ ను ఎందుకు పెట్టారో వివరించారు. 


‘ఆరెంజ్’ టైటిల్ వెనుక అసలు కారణం ఇదే: భాస్కర్


‘ఆరెంజ్’ సినిమా టైటిల్ అలా ఎందుకు పెట్టారో అర్థం కావాలంటే మనకు అసలు సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటో అర్థం కావాలి. ప్రేమ అనేది కొంత కాలమే ఉంటుంది. తర్వాత తగ్గిపోతుంది. అందుకే జీవితాంతం ప్రేమించడం కంటే. కొంచె కొంచెంగా ప్రేమను ఇస్తూ జీవితాంతం ప్రేమను అందించవచ్చు అనేది మూవీ కాన్సెప్ట్. సరిగ్గా ఇదే పాయింట్ ను బేస్ చేసుకొని టైటిల్ ను ఫిక్స్ చేశారట భాస్కర్. ఈ కాన్సెప్ట్‌ను సూర్యోదయం, సూర్యాస్తమయంతో పోల్చారు. ప్రకాశవంతమైన సూర్యోదయం ప్రేమ ప్రారంభాన్ని సూచిస్తుంది. అలాగే సూర్యాస్తమయాన్ని ప్రేమకు ముగింపుగా చెప్పారు. అయితే ఈ రెండు సమయాల్లోనూ సూర్యుడు ఆరెంజ్ కలర్ లో కనిపిస్తాడు. అందుకే ఈ సినిమాకు కూడా ‘ఆరెంజ్’ అనే టైటిల్ ను పెట్టాను అని చెప్పుకొచ్చారు బొమ్మరిల్లు భాస్కర్. దీంతో ఈ సినిమాకు ‘ఆరెంజ్’ అనే టైటిల్ ను ఎందుకు పెట్టారో ప్రేక్షకులకు అర్థమైంది.


‘ఆరెంజ్’ అప్పుడు కష్టం-ఇప్పుడు ఇష్టం..


వాస్తవానికి ‘ఆరెంజ్’ సినిమా ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్ సినిమాల లిస్ట్ లో ఉంటుంది. ఆ సినిమాలో పాటలు ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. అంతలా హిట్ అయింది ఆ మూవీ ఆల్బమ్. ఈ మూవీ 2010 నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా ప్రొడ్యూసర్ నాగబాబు ‘ఆరెంజ్’ చిత్రాన్ని నిర్మించారు. జెనీలియా హీరోయిన్ గా నటించింది. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బిగ్ షాక్ ఇచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లాపడి ఉక్కిరిబిక్కిరి అయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ‘ఇదేం సినిమారా బాబు’ అంటూ కామెంట్లు చేశారు. చాలా కొద్ది మందికి మాత్రమే ఈ మూవీ కాన్సెప్ట్ అర్థమైంది. అలాంటి సినిమాను దాదాపు 12 ఏళ్ల తర్వాత రీరిలీజ్ చేస్తే ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన వచ్చింది. అంతేకాదు ఇప్పటి వరకూ టాలీవుడ్ లో రీ రిలీజ్ అయిన సినిమాల లిస్ట్ లో ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది. 


Read Also: ఛీ పాడు, ఇవేం ప్రకటనలు? దేశంలో దుమారం రేపిన వివాదాస్పద యాడ్స్ ఇవే - వీటిలో ఉన్న తప్పేంటి?