పాలకూరతో చేసిన వంటకాలంటే పిల్లలు ఇష్టంగా తినరు.కాబట్ట వారికి నచ్చేవిధంగా వండి పెట్టాలి. కూరలో ఆకులు కనిపిస్తే పిల్లలు తినరు కాబట్టి, ఆకులు కనిపించకుండా వారికి పాలకూర వండి పెట్టాలి. పాలకూర్ పులావ్ చేస్తే పాలకూర ఆకులు కనిపించవు. కాబట్టి పిల్లలు సులువుగా తినేసే అవకాశం ఉంది. 


కావాల్సిన పదార్థాలు
పాలకూర - రెండు కట్టలు
బియ్యం - ఒక కప్పు
టమోటాలు - అర ముక్క
వేరుశెనగలు - పావు కప్పు
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - తగినంత


తయారీ ఇలా 
1. ఇది చాలా సులభమైన వంటకం పాలకూర ఆకులను కడిగి తరిగి పక్కన పెట్టుకోవాలి. 
2. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడెక్కనివ్వాలి. మంట మీడియంగానే ఉంచాలి. 
3. తరిగిన పాలకూర ఆకులను వేసి వేయించాలి. అందులోనే ఉప్పు, పసుపు కూడా వెళ్లాలి. 
4. ఐదు నుంచి పది నిమిషాలు చిన్న మంట మీద ఉడికించాలి. 
5. ఆకుల్లోని నీరంతా దిగి ఇంకిపోయేదాకా ఉంచాలి. తర్వాత స్టవ్ కట్టేయాలి. 
6. మరోపక్క టమోటాలు చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. 
7. పాలకూర చల్లబడ్డాక టమోటోలు, ఆ పాలకూర కలిపి మిక్సీలో మెత్తని పేస్టులా చేసుకోవాలి. 
8. ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకొని బియ్యం వేసి, ఆ బియ్యం ఉడకడానికి సరిపడా మూడు నుంచి నాలుగు కప్పుల నీరు పోయాలి. 
9. చిటికెడు ఉప్పు కూడా వేసి బాగా కలిపి కొన్ని నిమిషాలు ఉడికించాలి. 
10. అన్నం ఉడకడం పూర్తయ్యాక తీసి పెద్ద కళాయిలో వేసుకోవాలి. 
11. ఇప్పుడు ముందుగా చేసుకున్న పాలకూర టమోటా పేస్టును అందులో వేసి కలుపుకోవాలి. రుచికి సరిపోలేదనుకుంటే కాస్త ఉప్పు కూడా వేసుకోవచ్చు.
12.  మరోపక్క వేరుశనగలను వేయించి అవి కూడా వేసి కలపాలి. అంతే పాలకూర పులావ్ సింపుల్ గా సిద్ధమైపోయినట్టే. 


పాలకూరను ప్రతి రెండు రోజులకోసారి తినడం వల్ల శరీరానికి కావాల్సన ముఖ్యమైన పోషకాలు అందుతాయి. పాలకూర పోషకాలు నిండిన ఒక డబ్బాగా చెప్పొచ్చు. దీనిలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. పాలకూర పప్పు, పాలకూర వేపుడు, పాలకూర ఆలూ కర్రీలను వండుకుని తినేవాళ్లు ఎక్కువ. దీన్ని తరచూ తినడం వల్ల చర్మం సున్నితంగా మారి, మెరుపు సంతరించుకుంటుంది. చర్మం పొడిబారడం తగ్గుతుంది. జుట్టు చిట్లడం వంటివి కూడా తగ్గుతాయి. పాలకూరలో జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. గర్భిణిలకు ఇది చాలా అవసరం. ఫొలేట్ లోపం వల్ల పుట్టబోయే శిశువుల్లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.



Also read: రెస్టారెంట్లో తందూరి రోటీలను ఆర్డర్ చేస్తున్నారా? వాటితో వచ్చే ఆరోగ్య ప్రమాదాలు ఇవే













































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.