ప్రముఖ దర్శకుడు అట్లీ అభిమానులతో గుడ్ న్యూస్‌ను షేర్ చేసుకున్నారు. తాను తండ్రి అయినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పెళ్లైన చాలా కాలం తర్వాత తమ ఇంట్లోకి పండంటి బాబు అడుగు పెట్టినట్లు తెలిపారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎప్పుడూ కలగని అనుభూతి కలుగుతోందన్నారు. తల్లిదండ్రులుగా తమ ప్రయాణం  ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యిందని చెప్పారు. అందరి ఆశీర్వచనాలు ఉండాలని ఆకాక్షించారు. ప్రియా అట్లీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు భార్యతో కలిసి చిట్టి చెప్పులు పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అట్లీ గుడ్ న్యూస్ చెప్పడం పట్ల ఆయన అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అట్లీ దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు. చిన్నారికి ఆశీస్సులు అందిస్తున్నారు.






గత డిసెంబర్ లో గుడ్ న్యూస్ చెప్పిన అట్లీ


గత డిసెంబర్ లో తాను తండ్రిని కాబోతున్నానంటూ అట్లీ వెల్లడించారు. తన భార్య, నటి అయిన ప్రియ ప్రెగ్నెన్సీని కన్ ఫామ్ చేశారు. బేబీ బంప్‌తో ఉన్న ప్రియ ఫోటోలు పంచుకున్నారు అట్లీ. “మా కుటుంబం పెద్దది కాబోతుంది. ఈ శుభవార్తని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి. ఇన్ని సంవత్సరాలుగా మీరు మాపై కురిపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు చెప్తున్నాం. అదే ప్రేమని మా చిన్నారి మీద కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాం” అని  సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.


8 ఏళ్ల తర్వాత పేరెంట్స్ అయిన అట్లీ దంపతులు 


పెళ్లై ఎనిమిదేళ్ల తర్వాత అట్లీ దంపతులు పేరెంట్స్ అయ్యారు. అట్లీ దర్శకుడిగా రాణిస్తుండగా,  ప్రియ నటిగా కొన్ని సీరియల్స్ లో నటించింది.  పలు తమిళ సినిమాల్లో నటిగా ఆకట్టుకుంది. డబ్బింగ్‌ సినిమాలు ‘నా పేరు శివ’, ‘యముడు’ వంటి చిత్రాల్లో ఆమె నటించింది.  స్నేహితుల ద్వారా వీరిద్దరు పరిచయం అయ్యారు. కొంతకాలానికి ప్రేమలోపడ్డారు. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో 2014లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.


ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఆర్‌ మురుగదాస్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా అట్లీ పని చేశారు. మురుగదాస్‌ నిర్మాణ సంస్థలోనే తన తొలి మూవీ ‘రాజారాణి’ని తీశాడు. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది. ఆ తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్ తో కలిసి ‘తేరీ’ అనే సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సక్సెస్ తో అట్లీ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ‘తేరీ’ సక్సెస్ తో విజయ్‌తో వరుస సినిమాలు చేశాడు. ‘మెర్సల్‌’, ‘బిగిల్‌’ సినిమాలు సైతం మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో కలిసి ‘జవాన్’ అనే సినిమా రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. జూన్ 2, 2024లో ఈ సినిమా విడుదల కానుంది. 



Read Also: నన్నూ కమిట్మెంట్ అడిగారు, కాస్టింగ్‌ కౌచ్‌ పై నయనతార షాకింగ్ కామెంట్స్