సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై చాలా కాలంగా పొగ రగులుతూనే ఉంది. అవకాశాల పేరుతో ఎంతో మంది లైంగికంగా వాడుకుంటున్నారంటూ చాలా మంది నటీమణులు ఇప్పటికే నోరు విప్పారు. పడుకుంటేనే అవకాశాలు ఇస్తామంటూ పలువురు దర్శక నిర్మాతలు ముఖం మీదే అడిగినట్లు వెల్లడించారు. తాజాగా ఇదే అంశంపై సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార సంచలన వ్యాఖ్యలు చేసింది.
నన్నూ కమిట్మెంట్ అడిగారు- నయనతార
తాజాగా తన సినిమా ‘కనెక్ట్’ ప్రమోషన్ లో భాగంగా ఆమె పలు విషయాల గురించి మాట్లాడింది. ఈ సందర్భంగా కాస్టింగ్ కౌచ్ పైనా స్పందించింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉన్నమాట వాస్తవమేనని చెప్పింది. తాను కూడా అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపింది. “నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లో కాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదుర్కొన్నాను. తనను కూడా కొంత మంది వ్యక్తులు కమిట్మెంట్ అడిగారు. కానీ, వాళ్లకు నేను లొంగలేదు. నిర్మొహమాటంగా వారి మాటలను తోసిపుచ్చాను. ఆ తర్వాత నాతో ఎవరూ హద్దులు మీరి ప్రవర్తించలేదు. నా టాలెంట్ ను నమ్ముకునే ఈ స్థాయికి చేరుకున్నాను” అని నయనతార చెప్పుకొచ్చింది. అటు కాస్టింగ్ కౌచ్ గురించి మరికొన్ని కీలక విషయాలు వెల్లడించింది నయనతార. ఆయా నటీమణుల ప్రవర్తన మీద కూడా ఆధారపడి కాస్టింగ్ కౌచ్ ఉంటుందని చెప్పింది. మన ప్రవర్తన సరిగా లేకపోయినా ఇబ్బందులు వస్తాయని వెల్లడించింది.
నయనతార కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు
నయనతార కాస్టింగ్ కౌచ్ అంశం గురించి మాట్లాడ్డంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పుడో జరిగిన విషయాలను ఇప్పుడు బయటపెట్టడం వెనుక ఇంకేదో కారణం ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కనీసం, మీటూ క్యాంపెయిన్ సమయంలోనూ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నారు. అయినా, ఏ విషయాన్ని ఎప్పుడు మాట్లాడాలో తనకు బాగా తెలుసని మరికొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఎప్పుడు చెప్పాలనేది ఆమె వ్యక్తిగత విషయం అంటున్నారు.
దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ప్రేమ వివాహం చేసుకున్న నయనతార
ఇక సౌత్ ఇండియాలో పలు భాషల్లో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది నయనతార. గత కొంత కాలం క్రితం దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. గతేడాది జూన్ 9న మహాబలిపురంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. సరోగసీ ద్వారా నయనతార ఇద్దరు పిల్లలను కన్నది. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన అమ్మడు, తన భర్తతో కలిసి నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ప్రస్తుతం పలు వ్యాపారాల్లోనూ నయనతార రాణిస్తోంది.
Read Also: ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్, ప్రభాస్-హృతిక్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ మూవీ?