ఇండియాలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు ప్రభాస్, హృతిక్ రోషన్. ఇప్పటికే ఇండియన్ సూపర్ మ్యాన్ గా హృతిక్ పేరు సంపాదించగా, బాహుబలి, ఆదిపురుష్ లాంటి సినిమాలతో బిగ్గెస్ట్ యాక్షన్ కటౌట్ గా మారాడు ప్రభాస్. వీరిద్దరు హీరోలుగా ‘పఠాన్’ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఓ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకురానున్నాయి.
ప్రభాస్- హృతిక్ హీరోలుగా బిగ్గెస్ట్ మల్టీస్టారర్
ఈ ప్రతిష్టాత్మక సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే సిద్ధార్థ్ ఆనంద్ తో ఓ సినిమా కోసం అగ్రిమెంట్ చేసుకున్నట్లు నవీన్ యెర్నేని, రవి శంకర్ వెల్లడించారు. అటు ప్రభాస్ తో సినిమా చేయ్యబోతున్నట్లు బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్, హృతిక్ హీరోలుగా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మొదలైన స్క్రిప్ట్ వర్క్
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోంది. ఈ హై యాక్షన్ ఎంటర్టైనర్ కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. తాజాగా ‘పఠాన్’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న సిద్దార్థ్ ఆనంద్, ఇప్పటికే హృతిక్ రోషన్ తో రెండు సినిమాలు చేశాడు. ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’ సినిమాలతో హృతిక్ రోషన్ కు అదిరిపోయే హిట్స్ అందించాడు. ప్రస్తుతం హృతిక్ రోషన్ హీరోగా ‘ఫైటర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక ప్రభాస్-హృతిక్ రోషన్ సినిమా సెట్స్ మీదకు వచ్చే అవకాశం ఉంది.
యాక్షన్ సినిమాలకు కేరాఫ్ సిద్ధార్థ్ ఆనంద్
యాక్షన్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించడంలో సిద్ధార్థ్ ఆనంద్ కు మంచి అనుభవం ఉంది. హృతిక్ రెండు సినిమాలు, తాజాగా షారుఖ్ తో చేసిన ‘పఠాన్’ మూవీ సైతం హై రేంజ్ యాక్షన్ సినిమాలుగా తెరకెక్కాయి. ప్రేక్షకులను బాగా అలరించాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాస్-హృతిక్ హీరోలుగా రాబోయే సినిమా ఏ రేంజిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమా 2025లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వరుస సినిమాలతో ప్రభాస్ బిజీ
ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘ఆదిపురుష్’, ‘సలార్’ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అటు నాగ్ అశ్విన్ తో కలిసి ‘ప్రాజెక్ట్ కె’ చేస్తున్నారు. సందీప్ వంగాతో కలిసి ‘స్పిరిట్’ అనే మూవీ చేస్తున్నాడు. దర్శకుడు మారుతితోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ జాబితాలోకి సిద్ధార్థ్ ఆనంద్ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. ఈ సినిమా సెట్స్ మీదకు వచ్చేందుకు మరో రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ సినిమాతో మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది.
Read Also: అమెరికాలో ‘పఠాన్’ జోరు, థియేటర్‌లో ఆ నోటీస్ చూసి ఫ్యాన్స్ షాక్ - బాలయ్య ఎఫెక్టేనా?