టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల 'లైగర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దాదాపు రూ.60 కోట్లకు పైగా నష్టాలొచ్చినట్లు సమాచారం. చాలా థియేటర్లలో ఈ సినిమాను తీసేసి కొత్త సినిమాలను ప్రదర్శిస్తున్నారు. దీంతో విజయ్ సైలెంట్ అయిపోయారు. మీడియాలో ఎక్కడా కనిపించడం లేదు. తన తదుపరి సినిమాలతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నారు.
ఇలాంటి సమయంలో నిర్మాత దిల్ రాజు విజయ్ తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' తరువాత విజయ్ కి అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకరు. అప్పటినుంచి ఈ బ్యానర్ లో ఓ సినిమా బాకీ ఉండిపోయారు విజయ్ దేవరకొండ. ఇప్పుడు దిల్ రాజుతో కలిసి పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో విజయ్ కి మంచి కథను సెట్ చేసే పనిలో పడ్డారు దిల్ రాజు. ఈసారి ప్రాజెక్ట్ కి సంబంధించిన బాధ్యతలు మొత్తం దిల్ రాజు పైనే ఉంచాలని భావిస్తున్నారు విజయ్ దేవరకొండ.
దిల్ రాజుకి కథల విషయంలో ఉన్న పట్టు గురించి తెలిసిందే. ఆయన ఓకే చేస్తే కచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. కానీ ఈ మధ్యకాలంలో ఆయన జడ్జిమెంట్ కూడా దెబ్బతింటుంది. అయినప్పటికీ విజయ్ అతడిని నమ్మి సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ క్రమంలో దర్శకుడు ఇంద్రగంటితో విజయ్ ప్రాజెక్ట్ సెట్ అయినట్లు వార్తలొచ్చాయి. మరోపక్క హరీష్ శంకర్ కూడా దిల్ రాజుకి కథలు వినిపిస్తున్నారు. ప్రస్తుతానికి ఇంద్రగంటి, హరీష్ శంకర్ ఇద్దరిలో ఎవరినీ ఫైనల్ చేయలేదని సమాచారం. ఫైనల్ నేరేషన్ విన్న తరువాతే ఒక నిర్ణయానికి రానున్నారు. మరి దిల్ రాజు ఎవరికి ఓటేస్తారో చూడాలి.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అవే 'ఖుషి', 'జనగణమన'. 'ఖుషి' సినిమా కొత్త షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. విజయ్ పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. కశ్మీర్ నేపథ్యంలో రూపొందుతోన్న ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.
అశ్వనీదత్ తో మరో సినిమా:
అగ్ర నిర్మాత అశ్వనీదత్.. విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే సరైన కథ మాత్రం దొరకలేదు. ఇప్పుడు కథను లాక్ చేసినట్లు తెలుస్తోంది. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తో సౌత్ లో కూడా పాపులర్ అయిన రాజ్ అండ్ డీకే దర్శకులు విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనుకుంటున్నారు. ఇటీవల వారు చెప్పిన కథ విజయ్ కి నచ్చింది. అదే కథ అశ్వనీదత్ దగ్గరకు వెళ్లింది. ఆయనకు కూడా నచ్చడంతో.. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ఈ కథ దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.
Also Read: వాసన చూసి రుచి చెప్పేయొచ్చు, కృష్ణం రాజు చేపల పులుసు తయారీ వీడియో వైరల్!
Also Read : కృష్ణం రాజు ఫంక్షన్ కోసం షూటింగ్ క్యాన్సిల్ చేసిన సీనియర్ ఎన్టీఆర్