యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో దర్శకుడు చందు మొండేటి రూపొందించిన 'కార్తికేయ2' సినిమా రీసెంట్ గా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ చూసి థియేటర్లు కూడా పెంచుతున్నారు. అయితే ఈ సినిమాను దిల్ రాజు తొక్కేస్తున్నారని.. థియేటర్లు దొరక్కుండా చేస్తున్నారని వార్తలొచ్చాయి. నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' సినిమాకి ప్లాప్ టాక్ వచ్చినా.. ఆ సినిమాను థియేటర్లలో నుంచి తీయకుండా బలవంతంగా ఆడిస్తున్నారంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలపై స్పందించారు దిల్ రాజు. 'కార్తికేయ2' సక్సెస్ మీట్ కి దిల్ రాజు గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. 


ఆయన మాట్లాడుతూ.. ''ముందుగా ఈ ఎపిక్ బ్లాక్ బస్టర్ సినిమా తీసిన టీమ్ కి నా కంగ్రాట్స్. చాలా కష్టపడి అన్ని భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసి మంచి విజయం అందుకున్నారు. జూన్, జూలై నెలల్లో సినిమా ఇండస్ట్రీ ఎటు వెళ్తుందా అని భయమేసింది. కానీ ఆగస్టు నెల ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. 'బింబిసార', 'సీతారామం', 'కార్తికేయ2' లాంటి సినిమాలు మంచి కథలు ఎన్నుకోవాలని ఇన్స్పిరేషన్ ఇచ్చాయి. 'కార్తికేయ2' రిలీజ్ కు ముందు నిఖిల్ తో రిలీజ్ డేట్ కి సంబంధించి కొన్ని డిస్కషన్స్ జరిగాయి. 


'థాంక్యూ' సినిమా రిలీజ్ ఉండడంతో అదే సమయానికి రావాలనుకున్న 'కార్తికేయ2' టీమ్ ని వాయిదా వేసుకోగలరా అని అడిగాను. అప్పుడు నిఖిల్, చందు మొండేటి మా ఇంటికొచ్చి మరీ ఆల్టర్నేట్ డేట్ చూసుకుంటామని చెప్పారు. మా మధ్య అంత హెల్తీ రిలేషన్ ఉంటుంది. కానీ దాన్ని తప్పుగా పోట్రే చేస్తున్నారు. నిజానికి ఈ ప్రెస్ మీట్ లో ఈ విషయం గురించి మాట్లాడాలనుకోలేదు. కానీ క్లారిటీ ఇవ్వకపోతే యూనిటీ లేదనుకుంటారు అందుకే మాట్లాడాలని నిర్ణయించుకున్నాను.


నిఖిల్ సినిమా ఆగస్టు 5న రిలీజ్ చేయాలనుకున్నప్పుడు అదే సమయానికి మరో రెండు సినిమాలు ఉండడం, వాటికి పాజిటివ్ రిపోర్ట్స్ ఉండడంతో ఒకసారి ఆలోచించుకోమని చెప్పాను. అది నా సజెషన్ మాత్రమే. వారు ఫైనల్ గా ఆగస్టు 12న రావాలనుకున్నారు. అప్పుడు కూడా నేను సపోర్ట్ చేశాను. కానీ నితిన్ సినిమా అదే రోజున ఉండడంతో ఒకరోజు ఆగి ఆగస్టు 13న 'కార్తికేయ2'ని రిలీజ్ చేశారు. థియేటర్లో ఎన్ని సినిమాలు పోటీకి ఉన్నా.. ఇప్పటివరకు నాలుగు కోట్ల షేర్ రాబట్టింది 'కార్తికేయ2' అది మాములు విషయం కాదు. 


ఈ లెక్కలన్నీ మీకు తెలియక ఎవరికి తోచింది వాడు రాజుకుంటూనే ఉన్నాడు. సినిమాని తొక్కేస్తున్నారని ఇష్టమొచ్చినట్లు రాశారు. ఇక్కడ ఎవరు సినిమాలను తొక్కరు. సినిమా ఆడితే మేము ఆనందపడతాం. అది మరో సినిమా తీయడానికి ఊపిరి పోస్తుంది. మీ క్లిక్స్ కోసం, సబ్ స్క్రిప్షన్స్ కోసం మమ్మల్ని బలిపశువులను చేయొద్దు. మీకు తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వాస్తవాలు రాయండి.. క్లిక్స్ కోసం కాదు. సినిమా కోసం నేను ప్రాణమిస్తా.. అంతేకానీ పాడుచేయాలని చూడను. ఏదైనా రాసేముందు తెలుసుకొని రాయండి.. లేకపోతే మూసుకొని ఉండండి'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దిల్ రాజు.


Also Read: మహేష్ కోసం రూటు మార్చిన త్రివిక్రమ్ - నో సెంటిమెంట్, ఓన్లీ యాక్షన్!


Also Read: రెండు భాగాలుగా ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' - ఫ్యాన్స్‌కి పండగే!