ఆదిత్య, రుక్మిణి దేవి కోసం కొయ్యగూడెం బయల్దేరతారు. అప్పుడే చిన్మయి ఫోన్ చేస్తే విషయం చెప్తుంది. ఎందుకు చెప్పావు ఆ మాధవ్ గాడు మళ్ళీ విషయం తెలుసుకుని ఏదైనా చెయ్యడానికా అని ఆదిత్య రుక్మిణిని తిడతాడు. చిన్మయి దేవి దొరికిందని తనని తీసుకురావడానికి ఆఫీసర్ సర్, అమ్మ వెళ్లారు అని ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. పటేల్ కూడా ఉన్నాడంటే దేవమ్మని భద్రంగా తీసుకొస్తారులే అని భాగ్యమ్మ అంటుంది. ఇక అందరూ దేవుడు ముందు నిలబడి దణ్ణం పెట్టుకుంటారు. దేవి రాగానే ఎలాగైనా పంపించేయాలి అని జానకమ్మ మనసులో అనుకుంటుంది.


జానకమ్మ, భాగ్యమ్మ, చిన్మయి నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటే మాధవ్ వచ్చి ఏంటని అడుగుతాడు. చెల్లి ఎక్కడ ఉందో తెలిసింది తీసుకురావడానికి వెళ్లారని చెప్తుంది. షాకైన మాధవ్ అవునా ఎక్కడ ఉంది అని అడుగుతాడు. చిన్మయి మొత్తం చెప్తుంది. అవునా దేవి అక్కడ ఉందా అది మన ఏరియానే కదా అని మనసులో అనుకుంటాడు. దేవుడమ్మ సత్యని పిలిచి ఆఫీసులో వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తున్నారు చిరాకు పడుతుంది. ఆఫీసు పనులు కూడా చూసుకోవాలి కదా అని దేవుడమ్మ అంటుంది. అసలు దేవి మీద అంత పిచ్చి ప్రేమ ఎంతో నాకు అర్థం కావడం లేదని ఈశ్వరప్రసాద్ అంటాడు. మా అక్కతో కలిసి దేవి పేరు చెప్పి ఊర్ల మీద తిరుగుతున్నాడు, ఇంటికి రావాలి నా జీవితం ఏం చేయాలని అనుకుంటున్నాడో తేల్చుకుంటాను అని సత్య మనసులో అనుకుంటుంది.


Also Read: పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన వేద- మాళవికని ఎత్తుకుని పరుగులు పెట్టిన యష్


సత్య మాధవ్ ఇంటికి వస్తుంది. అక్కడ భాగ్యమ్మ పని చేయడం చూసి షాక్ అవుతుంది. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. ఇంతకాలం ఎక్కడో ఉంటున్నా అని చెప్పి ఇక్కడ ఉంటున్నావా. అక్క గురించి నీకు అంతా తెలిసి కూడా తెలియనట్టు ఉంటున్నావా అని అడుగుతుంది. నువ్వు ఇక్కడ ఉన్న ఇంత జరుగుతున్నా కామ్ గా ఉంటున్నావంటే ఆశ్చర్యంగా ఉందని అంటుంది. త్యాగం పేరుతో అక్క వచ్చి ఇన్నాళ్ళూ అయ్యింది, ఊరు పేరు అన్నీ మార్చుకుంది నువ్వు ఏం మార్చుకుని ఇక్కడ ఉంటున్నావ్, ఇద్దరం నీ కూతుర్లమె కదా నేను అవసరం లేదనిపించిందా అని సత్య భాగ్యమ్మని నిలదిస్తుంది.


ఇన్ని సంవత్సరాలుగా సంతోషంగానే ఉంది కదా మరి ఇప్పుడు నా గురించి ఎందుకు ఆలోచించకుండ ఇలా చేస్తుందని సత్య బాధపడుతుంది. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్ అని భాగ్యమ్మ చెప్తున్నా సత్య వినిపించుకోదు. నా జీవితం ఏమైపోయినా పర్వలేదనుకున్నావా అని సత్య ఏడుస్తూ అడుగుతుంది. అక్క ఏం చేసినా నాకు నచ్చేది ఇప్పుడు నచ్చడం లేదు నాకు త్యాగం చేయాలని అప్పట్లో ఏదో త్యాగం చేసిందని అనుకున్నా కానీ నాకు త్యాగం చేయకపోయినా పర్వాలేదు కానీ అన్యాయం చేయవద్దని చెప్పు అని సత్య భాగ్యమ్మ చేతులు పట్టుకుని ఏడుస్తుంది. అదంతా చిన్మయి చూస్తూ ఉంటుంది.


Also read: మోడ్రన్ డ్రెస్ వేసి చిందులు వేసిన తులసి, సామ్రాట్ - తప్పు చేశావన్న అనసూయ


దేవుడమ్మ ఆదిత్య రూమ్ లో తన వస్తువులు సర్దుతూ ఉంటే ఒక పుస్తకంలో రుక్మిణి ఫోటో కనిపిస్తుంది. అది చూసి దేవుడమ్మ షాక్ అవుతుంది. ఏంటి ఇది వీడి పుస్తకంలో ఇంకా రుక్మిణి ఫోటో ఉంది అంటే తను ఇంకా మనసులో నుంచి పోలేదా అని, అంటే వీడి జీవితంలోకి రుక్మిణి మళ్ళీ వచ్చిందా అందుకే వాడు ఈ మధ్య అదోలా ఉంటున్నాడా సూరికి కనిపించినట్టే ఆదిత్యకి కూడా రుక్మిణి కనిపించిందా అని దేవుడమ్మ అనుమానపడుతుంది.