నేచురల్ స్టార్ నాని, ‘మహానటి’ కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన ‘దసరా’ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. అమెరికాలో ఈ సినిమా నాని కెరీర్ హయ్యస్ట్‌గా నిలిచింది. 1.55 మిలియన్ డాలర్ల మార్కును వీకెండ్‌లోనే దాటేసి 2 మిలియన్ వైపుగా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు యూఎస్‌ఏలో నాని హయ్యస్ట్ గ్రాసర్‌గా ‘జెర్సీ’ ఉంది. ఇప్పుడు ‘దసరా’ ఆ రికార్డును కూడా దాటేసింది.
‘దసరా’ మొదటి రోజు (ప్రీమియర్‌లతో సహా) మొత్తం $850K కలెక్ట్ చేసి US బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు నాని సినిమాల్లో దసరాదే బెస్ట్ ఓపెనింగ్. నార్త్ ఇండియాలో మొదటి రోజు 'దసరా'కు 40 లక్షల రూపాయల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అయితే వీకెండ్‌లో సినిమా పుంజుకుంది. ఇప్పటివరకు దాదాపు రూ. రెండు కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చి ఉంటాయని అంచనా.
ఇప్పటివరకు ఓవరాల్‌గా నాని కెరీర్‌లో పెద్ద హిట్ ‘ఎంసీఏ’. ఈ సినిమా రూ.40 కోట్ల షేర్ వసూలు చేసింది. ‘దసరా’ ఈ మార్కును మొదటి వీకెండ్‌కే అధిగమించనుంది. ఆదివారం కలెక్షన్లు ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది.
నాని కెరీర్ లో తొలిసారి పాన్ ఇండియా మూవీ చేశారు. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల అని నాని పలు నగరాలు తిరిగి ప్రచారం చేశారు. తొలి రోజు సినిమాకు మంచి స్పందన లభించింది. కలెక్షన్స్ కూడా బావున్నాయి. ఈ సినిమాపై ఆడియెన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. విడుదలకు ముందు నుంచే ఓరేంజిలో హైప్ క్రియేట్ చేయడంతో, భారీ అంచనాలు నెలకొన్నాయి. వారి అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా థియేటర్లలో ధూమ్ ధామ్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ ను సొంతం చేసుకుంది.
ఎస్‌ఎల్‌వి సినిమాస్ నిర్మించిన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సాయి కుమార్, తమిళ నటుడు సముద్రఖని, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, పూర్ణ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.