నిన్న(ఫిబ్రవరి 20) దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022 ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప', సిద్ధార్థ్ మల్హోత్రా 'షేర్షా', విక్కీ కౌశల్ 'సర్దార్ ఉద్ధమ్' వంటి సినిమాలు అవార్డులు దక్కించుకున్నాయి. '83' సినిమాలో రణవీర్ నటనకు గాను బెస్ట్ యాక్టర్ గా అవార్డు దక్కింది. కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రణవీర్.. కపిల్ దేవ్ పాత్రలో నటించారు. 1983 వరల్డ్ కప్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. 


ఈ అవార్డు అందుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు రణవీర్. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. 'బెస్ట్ యాక్టర్'గా అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని.. '83' సినిమా ఎప్పటికీ తన మెమొరబుల్ ఫిల్మ్ గా నిలిచిపోతుందని.. ఈ సినిమాకి పని చేసిన క్యాస్ట్ అండ్ క్రూకి ధన్యవాదాలు చెప్పారు. 


'మిమి' సినిమాలో బెస్ట్ పెర్ఫార్మన్స్ కనబరిచిన నటి కృతిసనన్ కు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు దక్కింది. అలానే అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా 'ఫిలిం ఆఫ్ ది ఇయర్'గా నిలిచింది. 2021 డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. నార్త్ లో ఈ సినిమాకి భారీ క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి పార్ట్ 2 తెరకెక్కుతోంది. దసరా కానుకగా పార్ట్ 2ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.