యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన ‘క్రేజీ అంకుల్స్’ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా విడుదల ఆపాలంటూ.. తెలంగాణ మహిళా హక్కుల వేదిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ సినిమా శుక్రవారం ఎలాంటి అడ్డంకులు లేకుండానే విడుదలైంది. ప్రస్తుతమైతే ఈ సినిమాకు క్రేజీ టాక్ వస్తోంది.


మహిళ హక్కుల సంఘాల ప్రతినిధులు ఈ సినిమా ట్రైలర్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గురువారం విలేకరుల సమావేశం నిర్వాహించారు. ఈ సినిమా మహిళలను కించపరిచేలా ఉందని ఆరోపించారు. ఈ చిత్రం సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. వెంటనే ఈ సినిమాను ఆపేయాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆందోెళనలో భాగంగా హైదరాబాద్‌లోని మూసాపేట‌లో శ్రీరాములు థియేటర్‌కు వ‌చ్చిన ఈ సినిమా న‌టులు రాజా ర‌వీంద్ర‌, మ‌నోను మ‌హిళ‌లు అడ్డుకున్నారు. సినిమాలో మహిళలను కించపరిచేలా ఉన్న డైలాగులను తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. 'క్రేజీ అంకుల్స్' సినిమా పోస్ట‌ర్ల‌ను మ‌హిళ‌లు త‌గుల‌బెట్టారు. 


 ‘క్రేజీ అంకుల్స్’ సినిమాకు సీబీఎఫ్‌సీ నుంచి UA సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా కథ ప్రకారం.. ముగ్గురు అంకుల్స్ ఒక యువతి వెంట పడటం, ఈ సందర్భంగా వాళ్లు ఎదుర్కొనే సవాళ్లను ఫన్నీగా చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురి అంకుల్స్‌కు కథానాయిక ఏ విధంగా బుద్ధి చెప్పిందనేది ఈ చిత్ర కథాంశం. అయితే, ఈ చిత్రాన్ని మహిళలకు మద్దతుగానే తీశామని దర్శక నిర్మాతలు అంటున్నారు.  


ఇంట్లో భార్యను పట్టించుకోకుండా.. బయట అమ్మాయిల కోసం వెంపర్లాడే నడి వయస్సు పురుషులను ఉద్దేశిస్తూ ఈ చిత్రాన్ని తీసినట్లు తెలిపారు. ఈ చిత్రం ద్వారా చక్కని సందేశాన్ని కూడా అందిస్తున్నామని విడుదల సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుత వివాదం ‘క్రేజీ అంకుల్స్’ సినిమాకు కలిసొచ్చేదే. మరి, ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందో లేదో చూడాలి. 


క్రేజీ అంకుల్స్.. ట్రైలర్:


ఇటీవల యాంకర్ శ్రీముఖి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న సమస్యలను గురించి వివరించింది. ఓ యూట్యూబ్ చానెల్‌తో ఆమె మాట్లాడుతూ.. ‘‘వరుస షోలతో చాలా ఇబ్బందిగా ఉండేది. దీంతో మా నాన్నగారికి రెండు మూడు సార్లు ఫోన్ చేసి.. నేను ఈ ఇండస్ట్రీలో ఉండనని చెప్పేశాను. నాకు ఈ ఇండస్ట్రీ వద్దు.. నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చారని ఏడ్చేశాను. నిద్రపోవడానికి కూడా టైమ్ ఉండేది కాదు. యాంకరింగ్ చేయడానికి రోజంతా నిలబడే ఉండాల్సి వచ్చేది. హీల్స్ వేసుకుని నిలుచోవాలి. ఏది పడితే ఆ డ్రస్ వేసుకోవడానికి కుదిరేది కాదు. నేను గ్లామరస్ దుస్తులు వేసుకోవాలని డైరెక్టర్లు ఎక్స్‌‌పెక్ట్ చేసేవారు. ‘పటాస్’ కోసం రోజూ రెండు మూడు ఎపిసోడ్లు నిలబడే పనిచేశాను. ఎప్పుడో తప్ప కూర్చోడానికి సమయం దొరికేది కాదు. ‘గోల్డ్ రష్’ ఎపిసోడ్‌ కూడా రోజుకు నాలుగు, ఐదు ఎపిసోడ్లు చేసేదాన్ని. సుమారు గంట గంటన్నర సేపు నిలబడటం వల్ల కాళ్లు తిమ్మిరెక్కిపోయాయి. అలాంటి సమయంలో గొడ్డు చాకిరీ ఎందుకు చేయాలా అని అనిపించేది. ఆ తర్వాత క్రమేనా నేను చేసే పనిని ఇష్టపడటం మొదలుపెట్టాను. ప్రేక్షకులకు దగ్గరకావడంతో ఇష్టపడి పనిచేస్తు్న్నా’’ అని తెలిపింది.