వడివేలు.. తెలుగు సినిమాల్లో హాస్య నటుడు బ్రహ్మానందం తరహాలోనే.. అప్పట్లో తమిళ చిత్రాల్లో వడివేలు లేనిదే సినిమా లేదు అన్నట్లుగా ఉండేది. కానీ, అకస్మాత్తుగా ఏమైందో ఏమో.. వడివేలు మాయమయ్యాడు. కొత్త కొత్త హాస్య నటులు పుట్టుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి వడివేలు సినిమాలకు ఎందుకు దూరమయ్యారో తెలీదు. కానీ, తమిళ ప్రేక్షకులకు మాత్రం బాగా తెలుసు. ఒకటి కాదు, రెండు కాదు.. సుమారు నాలుగేళ్లుగా అక్కడి సినీ ప్రేక్షకులు ఆయన్ని బాగా మిస్సవుతున్నారు. వడివేలు కూడా పరిశ్రమకు దూరమై.. మానసిక వేదన అనుభవించాడు. చివరికి.. మళ్లీ ముఖానికి రంగు వేసుకోవాలనే ఆయన తపన, ఆరాటం ఫలించింది. ఇన్నేళ్లుగా అతడిపై ఉన్న బ్యాన్‌ను ఎత్తేస్తున్నట్లు తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) ప్రకటించింది. దీంతో వడివేలు వరుసగా ఐదు చిత్రాలకు సంతకాలు చేశాడు. త్వరలోనే ఆయన తన అభిమానులను అలరించేందుకు వస్తున్నాడు. మరి, వడివేలుపై బ్యాన్ విధించడానికి కారణం ఏమిటీ? దర్శకుడు శంకర్‌కు.. వడివేలుకు మధ్య జరిగిన ఆ గొడవేంటి?
దర్శకుడు శంకర్ నిర్మాతగా ఎస్ పిక్చర్స్ బ్యానర్‌పై 2017 సంవత్సరంలో ‘ఇమ్సాయ్ అరసన్ 23 పులికేసి- II’ సినిమా నిర్మిస్తున్న సమయంలో వడివేలుతో స్పర్థలు వచ్చాయి. వడివేలు షూటింగ్‌కు హాజరుకాకపోవడమే కాకుండా, చిత్రయూనిట్ ఎంపిక చేసిన సహనటులతో కలిసి పనిచేయనని మొండికేయడం, ఓ పాటను తొలగించాలని కోరడం వంటి కారణాల వల్ల శంకర్ టీఎఫ్‌పీసీని ఆశ్రయించాల్సి వచ్చింది. షూటింగ్‌కు హాజరుకాని రోజుల్లో కూడా వడివేలుకు పారితోషికం చెల్లించాల్సి వస్తోందని, దాని వల్ల తాము నష్టపోతామని పేర్కొన్నారు. అదే సమయంలో ‘నీయుమ్ నానుమ్ నడువుల పేయుమ్’ చిత్రం నిర్మాత ఆర్కే, మరో సినిమా నిర్మాత స్టెఫెన్ సైతం నడిగర్ సంఘంకు ఫిర్యాదు చేశారు. వడివేలు తమకు సహకరించడం లేదని ఆరోపించారు. దీంతో సంఘం వడివేలు మీద నిషేదం విధించింది. దర్శక నిర్మాతలు ఎవరూ ఇకపై వడివేలుతో సినిమాలు చేయరాదని ఆదేశించింది. అప్పటి నుంచి వడివేలు సినిమాల్లో కనిపించడం లేదు.
అప్పట్లో ఈ ఘటనపై వడివేలు ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ.. అవన్నీ నిరాధార ఆరోపణలు అని, తన ఎదుగుదలను చూసి ఓర్వలేకే ఈ చర్యకు పాల్పడ్డారని తెలిపాడు. అయితే, ఇటీవల లైకా ప్రొడక్షన్స్ సంస్థ వడివేలును మళ్లీ సినిమాల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ సంస్థకు సంబంధించిన రెండు ప్రాజెక్టుల్లో దర్శకుడు శంకర్ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో లైకా ప్రొడక్షన్ అధినేత సుభాస్కరన్ వివాదానికి తెరదించేందుకు రంగంలోకి దిగారు. దీంతో శంకర్, వడివేలు నడిగర్ సంఘాన్ని ఆశ్రయించడంతో నిషేదాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వడివేలు లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఐదు సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. దర్శకుడు సూరజ్ - వడివేలు కాంబినేషన్‌లో ‘నాయ్ శేఖర్’ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇది కాకుండా.. మధ్యలో నిలిచిపోయిన ‘పులికేసి-2’ సినిమాను కూడా కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టులతోపాటే లైకాకు చెందిన మిగతా ఐదు సినిమాల్లో కూడా వడివేలు నటించనున్నాడు. ఈ సందర్భంగా వడివేలు.. మళ్లీ తనను వెండితెరకు పరిచయం చేసిన సుభాస్కరణ్ రుణం ఎప్పటికీ మరిచిపోలేనని వెల్లడించాడు. అయితే వడివేలు.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భారతీయుడు-2’ సినిమాలో నటిస్తాడా, లేదా అనేది తెలియరాలేదు.
Read Also: ‘నెట్’ ట్రైలర్: గ్లామర్ డోసు పెంచిన అవికా గోర్.. బోల్డ్ సీన్స్‌లో రాహుల్ రామకృష్ణ
Read Also: అక్కినేని ‘లవ్ స్టోరీ’.. నాగ్-అమలను కలిపింది రామానాయుడే! కింగ్‌ను భయపెట్టిన కిస్