టాలీవుడ్ మొత్తం టెన్షన్‌లో ఉంది. ముగిసిపోయిందనుకున్న కేసు మళ్లీ మంగళవారం నుంచి డైలీ సీరియల్‌గా హైలెట్ కాబోతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ జారీ చేసిన నోటీసుల ప్రకారం ఇవాళ సెలబ్రిటీల విచారణ ప్రారంభమవుతుంది. మంగళవారం ఈడీ ముందు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ హాజరుకానున్నారు. ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఎవరెవరు ఎప్పుడెప్పుడు రావాలో కూడా సమాచారం ఇచ్చింది. సెప్టెంబర్ 22వరకు వరుసగా అందర్నీ ప్రశ్నించనున్నారు.
మనీలాండరింగ్ కోణంలోనే విచారణ..!
అయితే వీరంతా డ్రగ్స్ వాడారా లేదా అన్నదానిపై విచారణ జరగడం లేదు. డ్రగ్స్ కొనుగోలు కోసం వెచ్చిన మొత్తాన్ని ఎలా పంపారు.. లావాదేవీలు ఎలా జరిగాయన్న అంశంపైనే ఈడీ అధికారులు విచారణ జరపనున్నారు. ఇప్పటికే కోర్టులో ఎన్‌ఫోర్స్ మెంట్ క్రైం ఇన్ఫర్మేషన్ రిపోర్టు దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ సెక్షన్ 3,4 కింద కేసులు నమోదయ్యాయి. విచారణలో అక్రమ లావాదేవీలు గుర్తిస్తే ఆ మేరకు అదనపు కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు గతంలో మొత్తం 62 మందిని ప్రశ్నించారు. ఇప్పుడు ఈడీ కూడా అందర్నీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే పాత నేరస్తుల్ని ప్రశ్నించి వివరాలు రాబట్టారు.
నేరం తేలిస్తే ఆస్తుల జప్తునకు సన్నాహాలు..!
మరో వైపు ఈడీ వర్గాలు చాలా సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి. డ్రగ్స్ ఎలా తెప్పించేవారు..? డబ్బులు ఎలా చెల్లించారు..? అన్న వాటిపై పూర్తి సమాచారం ఈడీ అధికారులు సేకరించారని.. వాటిని ముందు పెట్టి సినీ ప్రముఖులను ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తోంది. హవాలా మార్గం ద్వారా లావాదేవీలు జరిగినట్లుగా భావిస్తున్నారు. అలాగే నేరం చేసినట్లుగా నిరూపితమైతే ఆస్తులు జప్తు చేస్తారు. పబ్ నిర్వహించే ఓ సినీ ప్రముఖుడు పెద్ద ఎత్తున తెప్పించి సినీ వర్గాలకు సరఫరా చేశాడని.. ఆయన ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈడీ కేసులో ఇరుక్కుంటే ఎక్సైజ్ కేసులు కూడా బయటకు..!
మరో వైపు సినీ ప్రముఖులకు మరో టెన్షన్ పట్టుకుంది. ఈడీ కేసుల్లో దొరికిపోతే.. ఇప్పటి వరకూ వారికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని చార్జిషీట్‌లో పేరు కూడా పెట్టని తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు తమ చార్జిషీట్లను సవరిస్తారేమోనని భయపడుతున్నారు. కారణాలు ఏమైనా కానీ ఆ సినీ ప్రముఖులు డ్రగ్స్ వాడారన్నదానికి ఆధారాలు దొరకలేదని వారి పేర్లను చార్జిషీట్లలో తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు చేర్చలేదు. ఇప్పుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా ఈడీ తేల్చితే వారిపై ఎక్సైజ్ శాఖ కూడా కొత్తగా చర్యలు తీసుకోక తప్పదు. అప్పుడు రెండు రకాలుగా టాలీవుడ్ స్టార్లు ఇరుక్కోక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందు ముందు డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.