అంతర్జాతీయ వేదికపై అత్యంత ప్రతిష్టాత్మక గ్లోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న‘RRR’ టీమ్ పై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్తున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు.. నాటు..’పాట ఆస్కార్ కు ఎంట్రీగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది. ఆ పాటకు సంగీతాన్ని అందించిన ఎంఎం కీరవాణి అవార్డును అందుకున్నారు. ఈ కేటగిరిలో అవార్డును అందుకున్న గెలిచిన తొలి భారతీయ చిత్రంగా ‘RRR’ ఘనత సాధించింది.
మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం- సీఎం వైఎస్ జగన్
‘నాటు నాటు’ సాంగ్ తో గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న‘RRR’ టీమ్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. “తెలుగు జెండా అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడుతోంది. యావత్ రాష్ట్రం తరపున, కీరవాణి, రాజమౌళి, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా ‘RRR’ టీమ్ కు అభినందనలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని చూసి మేం గర్వపడుతున్నాము” అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
గోల్డెన్ అవార్డు రావడం సంతోషకరం- చంద్రబాబు నాయుడు
‘RRR’ సినిమాలోని ‘నాటు.. నాటు..’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పట్ల టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. “బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న ‘RRR’ టీమ్ కు అభినందనలు. కీరవాణి, రాజమౌళితో పాటు సినిమాలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. అవార్డు రావడం అందరూ గర్వపడాల్సిన విషయం. తెలుగు ప్రస్తుతం భారతీయ మృదు భాషగా మారింది” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
‘నాటు.. నాటు..’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం పట్ల అభినందనలు చెప్పడంతో పాటు, ఆస్కార్ అవార్డుల్లోనూ సత్తా చాటాలని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
Read Also: ఈ గౌరవం ప్రతి భారతీయుడికి గర్వకారణం, ‘RRR’ టీమ్ కు ప్రధాని మోడీ అభినందనలు