సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్లకు హర్ష సాయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆపదలో ఉన్నవారికి, పెద్దవాళ్ళకి తనవంతు సాయం చేసే ఈ యూట్యూబ్ స్టార్ కి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ తో సహా అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ కలిపి అతనికి 10 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంతటి పాపులారిటీ ఉన్న హర్ష సాయి.. ఇప్పుడు సినీ రంగంలోకి అడుగు పెడుతున్నాడు. 


యూట్యూబ్ స్టార్ హర్ష సాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ అతను మాత్రం సినీ ఇండస్ట్రీలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో హీరోగా తెరంగేట్రం చేయడమే కాదు, ఒకేసారి రైటర్ గా డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే హర్ష సాయి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన చిత్రానికి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ క్రమంలో ఆదివారం (సెప్టెంబర్ 17) టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటుగా టీజర్ ను కూడా లాంచ్ చేసారు. 


హర్ష సాయి సినిమాకు 'మెగా' అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. దీనికి ‘లో డాన్’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించిన ఈవెంట్ లో టైటిల్ టీజర్ ను రిలీజ్ చేసారు. 'ప్రపంచానికి తెలియని ప్రపంచంలోని అత్యంత ఘోరమైన శిక్షల్లో ఇది ఒకటి' అంటూ ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఇదొక విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ అని టీజర్ ని బట్టి అర్థమవుతోంది. 


Also Read: డై హార్డ్ ఫ్యాన్ అంటే ఇతనే - వెంటిలేటర్‌తో థియేటర్‌కు వచ్చి 'జవాన్' సినిమా చూసిన వీరాభిమాని!


ఓ భారీ గంటకు హర్ష సాయిని కట్టేసి శిక్షించడానికి ఓ గ్యాంగ్ ఏర్పాట్లు చేయడాన్ని 'మెగా' టీజర్ లో చూడొచ్చు. హర్ష వీపుపై ఉన్న ఓ టాటూను హైలైట్ చేస్తూ, అతని పాత్రకు ఓ రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. ఓ వింత మనిషి అతన్ని చంపేయడానికి సిద్ధపడుతుండగా.. ''జీవితంలో ఓటమిని ఒప్పుకున్న ఆ క్షణమే నిజమైన ఓటమి.. ఒరేయ్ నన్ను చూస్తే ఒప్పుకునే వాడిలా కనిపిస్తున్నానంటావా?'' అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో సాయి లేస్తాడు. ''చావు గురించి మాట్లాడుతున్నావ్ కదా.. అసలు చావు అంటే ఏంటి?'' అంటూ పడుకునే కాలు మీద కాలు వేసుకొని పైకి చూస్తున్న హీరోకి ఓ ఆత్మ కనిపిస్తుంది. 


ఈ క్రమంలో ఎవరికీ తెలియని ఒక ప్రపంచంలో చాలా శక్తివంతమైన జంతువులు ఉన్నాయని.. ఒక్కడిని మాత్రం ఈ భూమ్మీద ఉన్న అత్యంత శక్తివంతమైన జంతువుతో పోలుస్తారని.. దాని పేరే 'మెగా - లో డాన్' అని టీజర్ లో చెప్పబడింది. ''ఈ కథ రాక్షసులతో నిండిన సముద్రాన్ని కుదిపేసి, రాజైన మనిషిది, అతని తెలివి అపారం'' అని వివరించడంతో ఈ టీజర్ ముగిసింది. 



ఓవరాల్ గా ‘మెగా - లో డాన్’ టైటిల్ టీజర్ ని ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓ డిఫరెంట్ బ్యాక్‍ డ్రాప్‍ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విజువల్స్ గ్రాండియర్‌ గా ఉన్నాయి. హర్ష సాయి ఎంట్రీతోనే చాలా బరువైన కథతో రాబోతున్నాడని అర్థమవుతుంది. అతని బేస్ వాయిస్ తో డైలాగ్స్ చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. కాకపోతే ఈ భారీ సెటప్ కు హర్ష అప్పియరెన్స్‌ అంతగా సెట్ కాలేదేమో అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని కల్వకుంట్ల వంశీధర్ రావు సమర్పణలో శ్రీ పిక్చర్స్ బ్యానర్ పై మిత్రా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial