వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించిన సినిమా 'యాత్ర'. వైయస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించారు. ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టడానికి ముందుకు రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ఆ సినిమా తీశారు. ఈ రోజు ఆయన జయంతి. ఈ సందర్భంగా 'యాత్ర 2' మోషన్ పోస్టర్ (Yatra 2 Motion Poster) విడుదల చేశారు.
రెండో యాత్ర... జగన్ జీవితంలో కథ!
'యాత్ర'లో వైయస్సార్ రాజకీయ ప్రయాణాన్ని చూపించిన మహి వి రాఘవ్ (Mahi V Raghav)... ఇప్పుడీ 'యాత్ర 2'లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణాన్ని చూపించనున్నారు. వైయస్సార్ మరణం నుంచి జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన పరిణామాలను ఆయన చూపించనున్నారు.
విజయవంతమైన చిత్రాలు 'పాఠశాల', 'ఆనందో బ్రహ్మ', 'యాత్ర'... వెబ్ సిరీస్‌లు 'సేవ్ ద టైగర్స్', 'సైతాన్'తోనూ మహి వి రాఘవ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడీ 'యాత్ర 2' చిత్రాన్ని 3 ఆటమ్ లీవ్స్, వి సెల్యులాయిడ్ సంస్థలపై శివ మేక నిర్మిస్తున్నారు.
'యాత్ర 2'... 2009 నుంచి 2019 వరకు!
'యాత్ర 2'లో 2009 నుంచి 2019 వరకు జగన్ మోహన్ రెడ్డి జీవిత, రాజకీయ ప్రయాణాన్ని చూపిస్తానని, ఆయన ఎదుగుదలను పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని 'యాత్ర 2' మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు మహి వి రాఘవ్ తెలిపారు.
Also Read : ఊరిలోకి వస్తే చంపేస్తారా? పేగులతో వీణ చేసి వీధి వీధినా మీటుతూ...
ఇంకా ఆయన మాట్లాడుతూ ''సినిమాలో చూపించేవి వాస్తవ సంఘటనలే అయినా జనాలను ఆకట్టుకునేలా తెరకెక్కించేందుకు ఫిక్షన్ యాడ్ చేస్తాం. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టే కొడుకు అనే పాయింట్ చుట్టూ 'యాత్ర 2' నడుస్తుంది'' అని చెప్పారు. రెండు గంటల్లో కథను చెప్పాలంటే కొన్ని మార్పులు చేర్పులు చేయక తప్పదని, తానూ ఆ విధంగా చేస్తానని చెప్పారు. కథ పరంగా 'యాత్ర', 'యాత్ర 2' మధ్య ఏ సంబంధం ఉండదని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి జీవితంలో ఎత్తుపల్లాలు ఉన్నాయని, వాటినే సినిమాలో చూపిస్తామని చెప్పారు.
నిజ జీవితంలో మనుషులు ఉంటారు!
'యాత్ర' చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ ఏ విధంగా అయితే ఆదరించారో, ఇప్పుడీ 'యాత్ర 2' సినిమాను సైతం అదే విధంగా ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు చిత్ర నిర్మాత శివ మేక తెలిపారు. నిజ జీవితంలో ఉండే పాత్రలన్నీ ఈ సినిమాలో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
'యాత్ర 2'లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు జీవా (Tamil Hero Jiiva) కనిపించనున్నారని సమాచారం. అయితే... ఆ వివరాల్ని 'యాత్ర 2' మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో వెల్లడించలేదు. త్వరలోనే నటీనటుల వివరాలను ప్రకటిస్తామని మహి వి రాఘవ్ తెలిపారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం, మధి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. సెల్వ కుమార్ చిత్రానికి కళా దర్శకుడు.
Also Read : మెగాస్టార్ to పవర్ స్టార్ - నెల రోజుల వ్యవధిలో ఐదుగురు మెగా హీరోల సినిమాలు, ఫ్యాన్స్‌కు పండుగే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial