దక్షిణాది సినీ పరిశ్రమకి సంబంధించి 'సైమా' అవార్డ్స్(SIIMA) ఉత్సవాలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది కూడా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమా(SIIMA) 2023 ఉత్సవాలకి ముహూర్తం ఖరారు అయింది. సెప్టెంబర్ 15, 16 తేదీలలో సైమా వేడుకలు నిర్వహించబోతున్నట్టు సైమా చైర్ పర్సన్ బృందాప్రసాద్ వెల్లడించారు. సుమారు 11 ఏళ్లుగా ఎంతో విజయవంతంగా సైమా వేడుకలు జరుగుతున్నాయని, ఈ ఏడాది జరిగే సైమా ఉత్సవాలకు దుబాయ్ నగరం వేదిక కానుందని ఈ సందర్భంగా బృందాప్రసాద్ తెలియజేశారు. అంతేకాదు ఈసారి జరిగే సైమా వేడుకలకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నెక్సా(Nexa) స్పాన్సర్ గా వ్యవహరించందని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే సైమా వేడుకల గురించి అధికారిక సమాచారం ఇచ్చేందుకు తాజాగా ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సైమా చైర్ పర్సన్ బృందాప్రసాద్ మాట్లాడుతూ.. "సౌత్ ఇండియాలో అనేక సినీ పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమలోని సృజనాత్మకతను గుర్తించేందుకు, ప్రతిభను ప్రోత్సహించేందుకు సైమా, నెక్సా కలిసాయి. ఇది చాలా ఆనందం కలిగించే విషయం. ఇకనుంచి ఈ బంధం ఎంతో బలంగా ప్రభావం చూపించాలని ఆశిస్తున్నా" అని పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. "సైమా సంస్థ దక్షిణాది సినీ పరిశ్రమను ఓకే తాటిపైకి తెచ్చింది. ఈ వేడుకల్లో నేను భాగం అవడం ఎంతో ఆనందంగా ఉంది" అని అన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ "అభిమానుల ప్రేమను తను స్వీకరించానని చెబుతూ తన తొలిచిత్రమైన 'సీతారామం' గురించి ప్రస్తావించారు. ఈ సినిమా విడుదలైన వెంటనే తాను సైమాలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. దుబాయ్ లోని D. W.T. C జరిగే ఈ వేడుకలు పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు" చెప్పుకొచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కాగా దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డ్స్ లో సైమా మొదటి స్థానంలో ఉంది. అయితే సైమా వేడుకలు దుబాయ్ లో నిర్వహించడం ఇది మొదటిసారి కాదు.
గతంలో కూడా పలుసార్లు దుబాయ్ వేదికగా సైమా ఉత్సవాలు జరిగాయి. గత ఏడాది సైమ ఉత్సవాలు అక్టోబర్ నెలలో ఎంతో గ్రాండ్గా నిర్వహించారు. దక్షిణాదికి చెందిన పలువురు అగ్ర నటీనటులు ఈ వేడుకలు పాల్గొని సందడి చేశారు. ఇక ఈ అవార్డుల ప్రధాన ఉత్సవంలో సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప : ది రైజ్' ఎక్కువ అవార్డులను కైవసం చేసుకుని జోరు చూపించింది. ఏకంగా ఆరు విభాగాలలో అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు క్యాటగిరిలో 'పుష్ప' సినిమాకి సైమా అవార్డ్స్ దక్కడం విశేషం. మరి ఈసారి సైమా 2023 అవార్డ్స్ లో టాలీవుడ్ తరఫున ఏ సినిమాకి ఎక్కువ అవార్డ్స్ దక్కుతాయో చూడాలి.
Also Read : విజయ్ 'లియో' లో రామ్ చరణ్ గెస్ట్ రోల్ - అసలు నిజం ఇదే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial