Yash's Film Controversy: కన్నడ స్టార్ హీరో యష్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన తాజా చిత్రం ‘టాక్సిక్‘ షూటింగ్ కోసం అటవీ భూముల్లోని చెట్లను అడ్డగోలుగా నరికేశారంటూ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. సినిమాల కోసం పెద్ద మొత్తంలో చెట్లను ధ్వంసం చేస్తున్నారంటూ పర్యావరణ కార్యకర్తల నుంచి కర్నాటక ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు.  


సమగ్ర నివేదిక అందించాలంటూ అధికారులకు ఆదేశం


షూటింగ్ కోసం చెట్లను నరికివేసిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి ఈశ్వర్ ఖండ్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చెట్లు ఉన్నట్లుగా గతేడాది శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపించిందన్నారు. రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ నుండి సేకరించిన గత చిత్రాలు, తాజా చిత్రాలను పరిశీలించినట్లు చెప్పారు. అనుమతులు లేకుండా అటవీ భూమిలో వేలాది చెట్లను నరకడం నేరం అన్నారు.  ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని బెంగళూరు కార్పొరేషన్‌ అధికారులను ఆదేశించారు. సినిమా షూటింగ్ కోసం చెట్లు నరికేందుకు అనుమతి తీసుకున్నారా? లేదా? అనే వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు.


చెట్ల నరికివేతకు అనుమతించిన వారిపై చర్యలు


అటవీ భూముల్లోని చెట్లను నరికిన ‘టాక్సిక్‘ చిత్రబృందంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈశ్వర్ ఖండ్రే స్పష్టం తెలిపారు. చెట్ల నరికివేతకు అనుమతి ఇచ్చిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల‌ను ఆదేశించారు. అడవుల్లో చెట్లను నరికివేసేందుకు ఎవరు పర్మీషన్ ఇచ్చినా చర్యలు తప్పవన్నారు. అటవీ ప్రాంతంలో అక్రమంగా చెట్లను నరికివేతకు బాధ్యులైన వారందరిపైనా ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు.   


ఆరోపణలను ఖండించిన ‘టాక్సిక్’ నిర్మాణ సంస్థ


అటు అటవీ భూముల్లో చెట్లు అక్రమంగా నరికివేశారంటూ వస్తున్న వార్తలను ‘టాక్సిక్’ చిత్ర నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ కొట్టిపారేసింది. తమ సంస్థ ఎలాంటి తప్పు చేయలేదని తేల్చి చెప్పింది. “మేం షూట్ చేస్తున్నది ప్రైవేట్ ప్లేస్. షూటింగ్ కు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నాం. ఫిబ్రవరి 2024లో షూటింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులకు అందించాం. మేము అటవీ శాఖ నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం. తమ మీద తప్పుడు కేసులు పెడితే, కోర్టులో సవాల్ చేస్తాం” అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుప్రీత్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను నిలిపివేసినట్లు మేకర్స్ తెలిపారు.



వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు ‘టాక్సిక్’


యష్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్‌ దాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. గత కొద్ది రోజులుగా బెంగళూరు సమీపంలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజా వివాదంతో షూటింగ్ క్యాన్సిల్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 10, 2025న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తొలుత ప్రకటించినా... చిత్రీకరణ ఆలస్యం అవుతూ ఉంటడంతో ఆ తేదీకి సినిమాను విడుదల చేయలేమని ఇటీవల యష్ తెలిపారు.


Read Also: ‘క‘ బాగాలేదనిపిస్తే సినిమాలు వదిలేస్తా... ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ స్పీచ్