ఒకరితో ఒకరు పోటీ పడటానికి, సినిమాతో సినిమా పోటీ పడటానికి ఇది రాజకీయం కాదని కన్నడ స్టార్ హీరో యష్ వ్యాఖ్యానించారు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'కె.జి.యఫ్ 2'. ఏప్రిల్ 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కంటే ఒక్క రోజు ముందు 'బీస్ట్' విడుదలకు సిద్ధమైంది. రెండూ పాన్ ఇండియా సినిమాలే.


'కె.జి.యఫ్ 2' వర్సెస్ 'బీస్ట్' అంటూ చాలా మంది కంపేర్ చేస్తున్నారు. ఒక్క రోజు వ్యవధిలో రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. బెంగళూరులో 'కె.జి.యఫ్ 2' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఈ కామెంట్స్ మీద యష్ స్పందించారు. 
"ప్రేక్షకుల ముందుకు రెండు సినిమాలు వస్తున్నాయి... 'కె.జి.యఫ్ 2' అండ్ 'బీస్ట్'. 'కె.జి.యఫ్ 2' వర్సెస్ 'బీస్ట్' కాదు. ఇవి ఎన్నికలు కాదు. ఎన్నికలు అయితే... ప్రతి ఒక్కరికీ ఒక్క ఓటే ఉంటుంది. ఆ ఓటు ఎవరో ఒకరికి వేయాలి. ఎక్కువ ఓట్లు వచ్చినవారు గెలుస్తారు. ఇంకొకరు ఓడిపోతారు. అందుకని, ఎన్నికల్లో పోటీ ఉంటుంది. సినిమాలకు వచ్చేసరికి ప్రేక్షకులు రెండు సినిమాలూ చూడొచ్చు. మాది పాన్ ఇండియా సినిమా. ఎనిమిది నెలల క్రితమే విడుదల తేదీ ప్రకటించాం. మాకు తెలియదు... విజయ్ సార్ సినిమా వస్తుందని! 'కె.జి.యఫ్ 2' వర్సెస్ 'బీస్ట్'గా చూడొద్దు. విజయ్ సార్ ఎన్నో ఏళ్లుగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. నాకంటే సీనియర్స్ కంటే నేను పెద్దోడిని అనుకున్నప్పుడు నా డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. విజయ్ సార్ అభిమానులు ఆయన సినిమాను సెలబ్రేట్ చేసుకుంటారు. మా సినిమా కూడా వాళ్లకు నచ్చుతుందనే నమ్మకం ఉంది" అని యష్ చెప్పారు.


Also Read: 'నాకు ఎవడి దోస్తీ అక్కర్లేదు' - 'కేజీఎఫ్2' ట్రైలర్ వచ్చేసిందోచ్


"నేను చాలా సింపుల్ గా చెబుతా... ఒక ఛాట్ బండి దగ్గరకు వెళ్లి తిన్నారు. అది బావుంటే స్నేహితులకు చెబుతారు. దాని అర్థం వేరే బండి దగ్గర ఛాట్ తినొద్దని కాదు కదా! అక్కడా తింటారు. ఇంకో బండి దగ్గర కూడా తింటారు. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం మీద దృష్టి పెట్టాలి, పోటీ మీద కాదు" అని యష్ చెప్పుకొచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన 'కె.జి.యఫ్ 2' కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.