Prasanna Kumar Bezawada: రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు 'జబర్దస్త్' కామెడీ షోలో స్కిట్ లు రాసిన ఆయన, ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే రైటర్స్ లో ఒకరిగా ఉన్నారు. ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’, ‘నాన్న నేను నా బాయ్‌ ఫ్రెండ్స్’ ‘హలోగురు ప్రేమకోసమే’ 'ధమాకా' వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలకు రచయితగా పనిచేసి గుర్తింపు పొందారు. ఇటీవల 'నా సామి రంగా' వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి డైలాగ్స్ రాసిన ప్రసన్న.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలోని నెపోటిజం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. 


బెజవాడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ''రామ్ చరణ్ లాంటి హీరోల గురించి, నెపోటిజం హీరోల గురించి చాలామంది మాట్లాడుతుంటారు. హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్ లో ఉన్న చిరంజీవి గారు, మచిలీపట్నంలోని ప్రసన్నకుమార్‌ ను ఇన్స్పైర్ చేసి ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. సొంత ఇంట్లో పక్క బెడ్ రూల్ లో పడుకున్న కొడుకుని ఇన్స్పైర్ చెయ్యలేకపోతే ఆయన మెగాస్టార్ ఎందుకు అవుతారు. చిరంజీవి గారి సినిమా బాగాలేకపోతే మొదటి రోజు మ్యాట్నీకి ఎవరూ చూడరు. అలాంటిది టాలెంట్ లేకపోతే ఆయన కొడుకుని ఎందుకు చూస్తారు?'' అని అన్నారు. 


టాలీవుడ్ లో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీల నుంచి ఎప్పటికప్పుడు కొత్త హీరోలు పరిచయం అవుతూనే ఉంటారు. నెపోటిజం, ఫేవరిజం గురించి ఎన్ని చర్చలు జరిగినా స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూనే ఉంటారు. అయితే వారిలో టాలెంట్ ఉన్న కొందరు మాత్రమే నిలదొక్కుకుంటున్నారు. మిగతా వారు రెండు మూడు చిత్రాలకే పరిమితం అవుతున్నారు. ఇదే విషయాన్ని ఇప్పుడు రైటర్ ప్రసన్న కుమార్ చెబుతున్నారు. ఎంత పెద్ద స్టార్ హీరో కొడుకైనా టాలెంట్ ఉంటేనే ఆదరిస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా అయినా బాగాలేకపోతే మ్యాట్నీ షోకే జనాలు చూడరని, ఆయన కొడుకు అనే కారణంతో రామ్ చరణ్ సినిమాలను ఎందుకు చూస్తారని అన్నారు. చిరుకి దేశంలోని రెండో అత్యున్నత పౌర పురష్కారమైన పద్మవిభూషణ్ రావడంపై స్పందిస్తూ.. ఎవరో చెప్పినట్లు సీఎం పోస్ట్ కంటే చిరంజీవి పోస్ట్ పెద్దదన్నారు. అవార్డులు ఇప్పుడు ఆయనకు పెద్దగా తెచ్చిపెట్టేదీ ఏమీ లేదని వ్యాఖ్యానించారు.


ఇదిలా ఉంటే చిరంజీవితో వర్క్ చెయ్యాలని బెజవాడ ప్రసన్నకుమార్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మాణంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అనౌన్స్ చేయబడిన చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నట్లు అప్పట్లో టాక్ వచ్చింది. అయితే 'విశ్వంభర' సినిమా లైన్ లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పక్కకెళ్ళిపోయింది. ఇక కింగ్ అక్కినేని నాగార్జున తన 'నా సామి రంగా' సినిమాతో ప్రసన్నను డైరెక్టర్ గా లాంచ్ చేయబోతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. రచయిత సైతం ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కానీ చివరకు ఆయన్ను మాటలకే పరిమితం చేసి, దర్శకత్వ బాధ్యతలను కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ చేతిలో పెట్టారు. మరి త్వరలోనే ప్రసన్నకుమార్ మెగా ఫోన్ పట్టుకొని డైరెక్టర్ గా మారుతారేమో వేచి చూడాలి.


Also Read: ఇంట్రెస్టింగ్ గా 'KJQ - కింగ్ జాకీ క్వీన్' టైటిల్ టీజర్ - హీరోగా దసరా దర్శకుడి సోదరుడు!