తెలుగు చలన చిత్ర పరిశ్రమ మాత్రమే కాదు... యావత్ తెలుగు ప్రజలు అందరూ గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు పద్మభూషణ్ పురస్కారం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ శుభ తరుణాన్ని సెలబ్రేట్ చేయాలనుకుంటుంది టాలీవుడ్. 


ఇండస్ట్రీ తరపున బాలయ్యకు సన్మానం!
తెలుగు చిత్రసీమలో బాలకృష్ణది 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.‌‌ విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తనయుడిగా వెండితెరపై అడుగు పెట్టారు. తన 14 ఏళ్ల వయసులో 'తాతమ్మ కల' సినిమాలో నటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఆయనకు రాలేదు.‌ తెలుగు ప్రజల ప్రేమ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. 


నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలకృష్ణను టాలీవుడ్ ఘనంగా సన్మానించింది. ఒక వేడుక నిర్వహించింది. ఇప్పుడు మరొకసారి టాలీవుడ్ అంతా బాలయ్య కోసం ఒక వేదిక మీదకు రానుంది. ఆయనకు పద్మ భూషణ్ పురస్కారం వచ్చిన సందర్భంగా ఒక భారీ ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. తనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించిన కేంద్ర ప్రభుత్వానికి బాలకృష్ణ థాంక్స్ చెప్పారు. తన ప్రస్థానం ఇంకా కొనసాగుతుందని ఆయన తెలిపారు.


నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తారా?
బాలకృష్ణకు పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా నిర్వహించబోయే వేడుకకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరినీ ఆహ్వానించాలని సన్నాహాలు జరుగుతున్నాయి. ఇతర భాషల నుంచి కూడా ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ వేడుకకు కింగ్ అక్కినేని నాగార్జున, బాల బాబాయ్ అంటూ అభినందనలు తెలిపిన అబ్బాయి మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వస్తారా? అనేది ప్రశ్న. 


నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలకు అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున తనయుడు నాగచైతన్య హాజరు అయ్యారు. నాగార్జున మేనల్లుడు సుమంత్ కూడా సందడి చేశారు. అయితే, ఆ వేడుకలో నాగార్జున కనిపించలేదు. బాలకృష్ణకు పద్మభూషణ్ వచ్చిన తర్వాత అభినందనలు తెలుపుతూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేయలేదు. రిపబ్లిక్ డే సందర్భంగా ఒక ట్వీట్ చేశారు. కానీ, బాలయ్య కోసం విషెస్ చెప్పలేదు. మరి, పద్మభూషణ్ అభినందన సభకు వస్తారా?


Also Readపాక్ బెదిరింపులు లెక్కలేదు... మహా కుంభమేళాకు బాలీవుడ్ కొరియోగ్రాఫర్, పేరు చూసి క్రిస్టియన్ అనుకోవద్దు


బాలయ్యకు అభినందనలు చెబుతూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అయితే... ఈ మధ్యకాలంలో బాబాయ్ అబ్బాయిలు కలిసి ఒక్క వేదిక మీద కనిపించిన సందర్భాలు లేవు. ఎన్టీఆర్ మాత్రమే కాదు... శత జయంతి ఉత్సవాలలో నందమూరి హరికృష్ణ మరో కుమారుడు కళ్యాణ్‌ రామ్ కూడా లేరు. ఆ సమయంలో హరికృష్ణ తనయులు హైదరాబాద్ సిటీలో లేరు. ఈసారి ఇక్కడే ఉండేలా ప్లాన్ చేస్తారా? లేదా? వెయిట్ అండ్ సీ. ట్వీట్స్‌లో కనిపించిన అనుబంధం స్టేజి మీద కనిపిస్తుందా? 


Also Read: రామ్ చరణ్ సినిమా నుంచి ఏఆర్ రెహ్మాన్ తప్పుకొన్నాడా... ఇండస్ట్రీ హాట్ న్యూస్, నిజం ఏమిటంటే?