2023 దసరా బాక్సాఫీస్ వార్ రసవత్తరంగా ఉండబోతోంది. ఈసారి సెలవులను క్యాష్ చేసుకోవడానికి నాలుగైదు పెద్ద సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. బాలకృష్ణ 'భగవంత్ కేసరి' గా వస్తుంటే.. రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' తో ఫైట్ కు రెడీ అవుతున్నాడు. వీటితో పాటుగా 'లియో' 'ఘోస్ట్' వంటి ఇతర భాషల పాన్ ఇండియా సినిమాలు బరిలో దిగుతున్నాయి. 'సప్త సాగరదాచే ఎల్లో' అనే కన్నడ డబ్బింగ్ మూవీ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎన్ని సినిమాలు వచ్చినా టాలీవుడ్ లో ప్రధాన పోటీ మాత్రం రెండు స్ట్రెయిట్ తెలుగు మూవీస్ మధ్యనే అని సినీ ప్రియులు భావిస్తున్నారు. 


'భగవంత్ కేసరి' - 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాల రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసినప్పటి నుంచే సోషల్ మీడియాలో ఇరు వర్గాల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ నేపధ్యంలో ఒక్క రోజు గ్యాప్ తో రాబోతున్న రెండు సినిమాలను బలాబలాలను విశ్లేషిస్తున్నారు.. బాలయ్య - రవితేజల గత ట్రాక్ రికార్డులను బేరీజు వేస్తున్నారు. దర్శకుల ప్రతిభను కంపేర్ చేస్తున్నారు. ఈసారి విజయ దశమికి ఇద్దరిలో ఎవరిని విజయం వరిస్తుందంటూ పోస్టులు పెడుతున్నారు. 


నటసింహం నందమూరి బాలకృష్ణ - మాస్ మహారాజా రవితేజ గతంలో నాలుగైదుసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. 2008 సంక్రాంతికి 'ఒక్క మగాడు' - 'కృష్ణ' సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. 2009లో 'మిత్రుడు' - 'కిక్' చిత్రాలు ఒక వారం గ్యాప్ లో థియేటర్లలోకి వచ్చాయి. 2011 పొంగల్ సీజన్ లో 'పరమవీర చక్ర' - 'మిరపకాయ్' సినిమాలు ఒకే రోజు పోటీ పడ్డాయి. 2012 సమ్మర్ లో 'అధినాయకుడు' - 'దరువు' చిత్రాలు వారం రోజుల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 


అయితే వీరిద్దరూ పోటీ పడినప్పుడల్లా బాలకృష్ణపై రవితేజే పైచేయి సాధించారు. అందుకే ఈసారీ గెలుపు తమదే అని మాస్ రాజా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఇకపై ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవ్వదని కామెంట్లు చేస్తున్నారు. గతంలో బాలయ్య సినిమాలు వేరు.. ఇప్పుడు వేరు. 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ఆయన మార్కెట్ నెక్స్ట్ లెవల్ కు చేరిపోయింది. కథల ఎంపికలో వైవిద్యం చూపిస్తున్న నటసింహం.. దసరాకి 'రావణాసుర' హీరోపై ఆధిపత్యం చూపిస్తారని బాలకృష్ణ అభిమానులు అంటున్నారు.


అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భగవంత్ కేసరి' చిత్రాన్ని అక్టోబర్ 19న విడుదల చేయనున్నారు. వంశీ కృష్ణ రూపొందిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా అక్టోబర్ 20న రిలీజ్ కానుంది. అనిల్ వరుస విజయాలు అందుకుంటూ, అపజయం ఎరుగని బ్లాక్ బస్టర్ డైరక్టర్ గా పిలవబడుతున్నాడు. మరోవైపు వంశీకృష్ణ ట్రాక్ రికార్డ్ ఏమంత బాగాలేదు. ఆయన డైరెక్ట్ చేసిన 'దొంగాట', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' సినిమాలు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. ఇప్పుడు రవితేజ సినిమాతోనే తన సత్తా ఏంటో చూపించాల్సి వుంది.


ఇప్పటి వరకూ ఈ రెండు సినిమాల నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. టీజర్లు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇవి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడానికి దోహదం చేశాయి. టీజర్లను బట్టి ఇద్దరు దర్శకులు తమ హీరోలను కొత్తగా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇలా ఈ సినిమాలకు చాలా ప్లస్సులు ఉన్నాయి.. మంచి బజ్ కూడా వుంది. డబ్బింగ్ చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదురుకాకపోతే బాలయ్య - రవితేజ సినిమాలు రెండూ ఫెస్టివల్ సీజన్ లో హిట్లు అందుకునే అవకాశం వుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఏం జరుగుద్దో వేచి చూడాలి.


Also Read: స్వాతంత్య్ర సమరయోధుడి బయోపిక్ తీసి ఆసుపత్రి పాలైన సినీ నిర్మాత


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial