సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరి లైఫ్ ఎలా ఉంటుందనేది ఊహించడం కష్టం. ఒక్క శుక్రవారంతో అందరి జాతకాలు మారిపోతుంటాయి. విజయాలు వస్తున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ, ఒక్క ఫ్లాప్‌ పడితే మాత్రం అంతా తలక్రిందులు అవుతుంది. ఎన్నో వ్యయ ప్రయాసలు పడి సినిమా తీసినా, దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మరెన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎక్కువగా చిన్న సినిమాల నిర్మాతలకే ఇలాంటి పరిస్థితిలు వస్తుంటాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. స్వాతంత్య్ర సమరయోధుడి బయోపిక్ తీసిన ఓ నిర్మాత, ఆ చిత్రాన్ని రిలీజ్ చేసుకోలేక, ఆర్థిక భారాన్ని తట్టుకోలేక ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. 


స్వేచ్ఛ‌, స్వాతంత్య్రాల కోసం చిన్న వ‌య‌సులోనే ప్రాణ త్యాగం చేసిన ఖుదీరామ్ బోస్‌ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఖుదీరామ్ బోస్’. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పిలుపుతో ప్రేరణ పొంది, నిర్మాత విజ‌య్ జాగర్ల‌మూడి తన గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. 


ఇటీవ‌ల గోవాలో జ‌రిగిన ఇంటర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియాలో ప్ర‌దర్శించ‌బడిన ‘ఖుదీరామ్ బోస్’ చిత్రానికి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. అలానే 2022 డిసెంబ‌ర్ 22న గౌరవనీయులైన పార్లమెంట్‌ సభ్యులకు ఈ సినిమాని ప్రదర్శించారు. అప్పట్లో సూపర్ స్టార్ రజినీకాంత్, నందమూరి బాలకృష్ణ, దర్శకులు మణిరత్నం, బోయపాటి శ్రీను వంటి పలువురు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే సినీ రాజకీయ ప్రముఖులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం ఇంతవరకూ విడుదలకు నోచుకోలేదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తీసిన సినిమా విడుదలకు నోచుకోక, ఆర్థిక సమస్యల ఒత్తిడితో నిర్మాత గుండెపోటుకు గురయ్యారని తెలుస్తోంది.


Also Read: రూటు మార్చిన ఈటీవీ - ఫ్యాన్సీ రేటుకి కల్ట్ బొమ్మ శాటిలైట్ హక్కులు?


సినీ పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన సాంకేతిక నిపుణులు ‘ఖుదీరామ్ బోస్’ చిత్రానికి పని చేసారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చగా, నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌ తోట త‌ర‌ణి ప్రొడక్ష‌న్ డిజైన‌ర్‌ గా వ్యవహరించారు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ర‌సూల్ ఎల్లోర్, స్టంట్ డైరెక్ట‌ర్‌గా క‌న‌ల్ క‌న్న‌న్‌, ఎడిట‌ర్‌గా మార్తాండ్ కె.వెంక‌టేష్ వ‌ర్క్ చేశారు. అయితే ఖుదిరామ్ బోస్ గురించి ఈ జనరేషన్ కి తెలియకపోవటం మరియు కమర్షియల్ సినిమాల మధ్య ఇలాంటి బయోపిక్ లకు పరిశ్రమ నుంచి, ప్రేక్షకుల నుంచి ఆదరణ లేకపోవడం నిర్మాతకు ఈ దుస్థితి రావడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 


భరత మాత ముద్దుబిడ్డ ఖుదీరామ్ బోస్...
బెంగాల్ ప్రెసిడెన్సీకి చెందిన భారతీయ విప్లవకారుడు ఖుదీరాం బోస్. మొదటి తరం భారత స్వాతంత్ర్య సమరవీరుల్లో అతిపిన్న వయస్కుడు. 1889లో జన్మించిన ఆయన చిన్న వయసులోనే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయం. బ్రిటీష్ అధికారిపై బాంబు వేసి సమర శంఖం పూరించిన బోస్ ను 1907లో ఆంగ్లేయుల ప్రభుత్వం ఉరితీసింది. ఉరితీసేనాటికి బోస్ వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. ఆ యోధుడి గురించి చరిత్రకారులకు, చరిత్రను అభ్యసించే వారిలో చాలా తక్కువ మందికే తెలుసు. అలాంటి యంగెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ గురించి నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో తీసిన బయోపిక్ 'ఖుదీరాం బోస్'. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదలకు నోచుకుంటుందో చూడాలి. 


Also Read: నార్వేలో భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న జక్కన్న!




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial