భారత చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ఒకరు. వెండితెరపై విజువల్స్ క్రియేట్ చేస్తూ దర్శక ధీరుడు అనిపించుకున్నారు. 'బాహుబలి' ప్రాంచైజీతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన ఆయన.. RRR సినిమాతో ఆస్కార్ కలను సాకారం చేసారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) మూవీ (SSMB 29) ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ గ్యాప్ లో తన ఫ్యామిలీతో కలిసి ఇటీవల నార్వేకు వెళ్లిన జక్కన్న... ఆ దేశంలోని పర్యాటక ప్రాంతమైన పల్పిట్ రాక్స్ ను తాజాగా సందర్శించారు. ‘మగధీర’ టైమ్ నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నానని చెబుతూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు.
''మగధీర సినిమా కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ పల్పిట్ రాక్ ఫొటోలు చూశాను. అప్పటి నుంచి ఇక్కడికి రావాలని అనుకుంటున్నాను. స్టావెంజర్లో జరగనున్న ‘బాహుబలి’ ఫిల్మ్ కన్సర్ట్ కు ధన్యవాదాలు చెప్పాలి. దాని కారణంగానే ఎట్టకేలకు నేను ఈ ప్రాంతాన్ని సందర్శించగలిగాను అని రాజమౌళి ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత పల్పిట్ రాక్ వద్ద తన సతీమణి రమా రాజమౌళితో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేశారు. ఎత్తైన కొండ ప్రాంతంలో జాగ్రత్తగా ఉండాలని అభిమానులు దర్శకుడికి కామెంట్ల రూపంలో సూచిస్తున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: రజినీకాంత్, అనిరుధ్ మధ్య ఉన్న 'బంధుత్వం' ఏంటో తెలుసా?
మహేశ్ బాబు కోసం స్టోరీ రెడీ చేస్తున్న రాజమౌళి అండ్ టీమ్.. మరోవైపు లొకేషన్స్ వేట ప్రారంభించినట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు నార్వేలోని పల్పిట్ రాక్స్ ను సందర్శించడంతో, ఆ లొకేషన్స్ లో SSMB29 మూవీని చిత్రీకరిస్తారేమో అని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్టార్ తో ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అడ్వంచర్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇది 'ఇండియానా జోన్స్' తరహా గ్లోబ్ ట్రాటనింగ్ యాక్షన్ మూవీ అని, తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని జక్కన్న స్వయంగా వెల్లడించారు. దీనికి తగ్గట్టుగా పల్పిట్ రాక్స్ లాంటి సుప్రసిద్ధ ప్రాంతాల్లో షూటింగ్ చేస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఎలాగూ ఫారిన్ ట్రిప్ లో ఉన్నారు కాబట్టి, పనిలో పనిగా లొకేషన్స్ వేట కూడా పూర్తి చేస్తారని అంటున్నారు.
నార్వేలోని స్టావెంజర్ లో 'బాహుబలి' కన్సర్ట్..
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా రెండు భాగాలుగా విడుదలై, బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రానికి సంబంధించి నార్వేలోని స్టావెంజర్ ఒపెరా హౌస్లో ఈ నెల 18న ఓ కాన్సర్ట్ జరగనుంది. ఈ ప్రదర్శన కోసం రాజమౌళి ఫ్యామిలీతో పాటుగా చిత్ర సమర్పకులు కె. రాఘవేంద్రరావు మరియు నిర్మాత శోభూ యార్లగడ్డ కలిసి నార్వేకు వెళ్లారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ జక్కన్న ఇటీవల ఓ ట్వీట్ చేశారు.
‘‘లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరిగిన ‘బాహుబలి: ది బిగినింగ్’ అద్భుత ప్రదర్శనను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ దృశ్యాలు ఇప్పటికీ నా కళ్లలో మెదలాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆగస్టు 18న నార్వేలోని స్టావెంజర్ ఒపెరా హౌస్లో ‘బాహుబలి 1’ కన్సర్ట్ జరగనున్నందుకు సంతోషంగా ఉంది. స్టావెంజర్ సింఫనీ ఆర్కెస్ట్రా సారథ్యంలో ఈ ప్రదర్శన జరగనుంది’’ అని రాజమౌళి ట్వీట్ లో పేర్కొన్నారు.
Also Read: రూటు మార్చిన ఈటీవీ - ఫ్యాన్సీ రేటుకి కల్ట్ బొమ్మ శాటిలైట్ హక్కులు?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial